నేతాజీ నగర్ లో సుభాష్ జయంతి వేడుకలు

నేతాజీ నగర్ లో సుభాష్ జయంతి వేడుకలు

ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్:  మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ పార్కులో గల నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి అప్పారావు,  నేతాజీ నగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఏ కృష్ణమూర్తి,  మాజీ అధ్యక్షుడు టీఎస్ ఆనంద రెడ్డి, మాజీ కార్యదర్శి, ముద్ర సంపాదకుడు వై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సముపార్జన కోసం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వీరోచిత పోరాటాలను స్మరించుకున్నారు.

సంపన్న కుటుంబంలో జన్మించి ఆనాటి సివిల్ సర్వీస్ కు  ఎంపికైనప్పటికీ దాన్ని తృణప్రాయంగా త్యజించి దేశ స్వాతంత్ర్యం కోసం నడుం కట్టారని వారు కొనియాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ను నెలకొల్పి, ప్రవాస భారతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వివిధ దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. గొప్ప దేశభక్తుడైన నేతాజీ భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కే ప్రభాకర్,  కార్యవర్గ సభ్యులు సయ్యద్ మలిక్, ఆరిపుద్దీన్, అసోషియేషన్ నాయకులు గంగాధరన్,  డాక్టర్ వరప్రసాద్,  ఆంజనేయస్వామి, పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.