2017 నుంచే..  రాజశేఖరుడి లీకు దందా

2017 నుంచే..  రాజశేఖరుడి లీకు దందా
  • డిపార్ట్​మెంటల్ ఎగ్జామ్ర్ తో మొదలు​
  • ఓ ఆర్ఐ కి రూ.30 వేలకు విక్రయం
  • ప్రవీణ్​ దోస్తానాతో మరింత పెరిగిన దందా
  • డీఎల్, జేఎల్​ పేపర్లూ అపుడే లీక్? 
  • ఇద్దరు నిందితులు ఉద్యోగాల నుంచి ఔట్
  • ఎవరెవరిని విచారణకు పిలవాలి
  • మల్లగుల్లాలు పడుతున్న సిట్​అధికారులు
  • హయ్యెస్ట్​ మార్కులు వచ్చిన వారందరికి నోటీసులు!
  • 28 మంది టాప్​ స్కోరర్లు అనుమానితులే!!


టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ దందా 2017 నుంచే సాగుతున్నట్లు స్పష్టమవుతున్నది. వివిధ శాఖలలో పదోన్నతుల కోసం నిర్వహించే పరీక్షల పేపర్లు లీక్​ చేయడం నుంచే ఈ దందా మొదలైందని సిట్​దర్యాప్తులో తేలింది. 2017లో రెవెన్యూ డిపార్ట్​మెంట్​ఎగ్జామ్​కు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని రాజశేఖర్​రెడ్డి లీక్​ చేసినట్లుగా గుర్తించారు. అప్పుడు రెవెన్యూలో ఆర్ఐ పదోన్నతి కోసం నిర్వహించిన పరీక్ష పేపర్​ లీక్​ చేశారు. దీనికోసం రూ. 30 వేలను రాజశేఖరరెడ్డి తీసుకున్నట్లుగా సమాచారం. అప్పటి నుంచి టీఎస్​పీఎస్సీలో లీకు దందా కొనసాగిందని గుర్తించినట్లు తెలుస్తున్నది. 

పేపర్​ లీకు వ్యవహారంలో నిందితుల కస్టడీ విచారణలో భాగంగా మూడు రోజుల పాటు సిట్ అధికారులు వివిధ కోణాలలో సమాచారం రాబడుతున్నారు. దీంతో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తున్నది. మూడో రోజు మంగళవారం హిమాయత్ నగర్ కార్యాలయంలో సిట్ చీఫ్ ఏఆర్.శ్రీనివాస్ సారథ్యంలో నిందితులను విచారించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్​ రెడ్డిని కమిషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ -కాన్ఫిడెన్షియల్ విభాగంలో నిందితులు యాక్సెస్ చేసినట్టు చెప్పిన కంప్యూటర్లను పరిశీలించారు. రాజశేఖర్​రెడ్డి ఏ విధంగా కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రాలు కాపీ చేసుకున్నాడు, అందుకు పట్టిన సమయాన్ని గుర్తించారు. ఆయా విభాగాల సాంకేతిక భద్రతా వైఫల్యం కూడా పోలీసులు ఆరా తీశారు. 


 ప్రశ్నాపత్రాల లీకు అంశంలో విచారణపై సిట్​సందిగ్థత పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్లను లీకు చేసి, విక్రయించడంలో చాలా మందికి ప్రమోషన్లు రాగా, మరికొందరికి ఉద్యోగాలు వచ్చాయి. వారందరినీ విచారణకు పిలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అనుమానాలు వస్తున్నాయి. ఇక, ప్రవీణ్​ ఫోన్​లో చాలా మంది అమ్మాయిల న్యూడ్​కాల్స్​ ఉన్నట్లు తేలింది. ఈ సందర్భంగా వారందరికీ ప్రశ్నాపత్రాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏకంగా 62 మంది అమ్మాయిల న్యూడ్​వీడియోలు, వారి ఫోన్​ నెంబర్లు సిట్​ అధికారుల ముందున్నాయి. వారిని విచారణకు పిలువాల్సిన అవసరం లేదని ఒకవర్గం చెబుతున్నది. కానీ, పోలీసులు మాత్రం విచారణకు పిలిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. దీనిపై స్పష్టత రాలేదు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో :
లీకేజీ కేసులో నిందితుడుగా ఉన్న రాజశేఖర్​రెడ్డి ముందుగా డిపార్ట్​మెంటల్​ ప్రమోషన్​ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీకు చేశాడని సిట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రాజశేఖర్​ రెడ్డి, ప్రవీణ్​రెడ్డి మధ్య స్నేహం పెరిగింది.  ప్రభుత్వం ప్రకటించిన కొలువుల భర్తీ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ల నుంచి ఈ దందా మరింత పెరిగింది. దీనిలో ఐపీ అడ్రస్​లను కాపీ చేసి, వాటి ఆధారంగా ప్రశ్నాపత్రాలను అధికారుల కంప్యూటర్ల నుంచి దొంగిలించారని, వాటిని విక్రయించడం కోసం ప్రవీణ్ రేణుక ద్వారా ఒప్పందం చేసుకున్నారని ఆధారాలు దొరికాయి. 2017 చివర్లో జరిగిన డిగ్రీ కాలేజీ, జూనియర్​ కాలేజీ లెక్చరర్ల నియామకం పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో ఇద్దరు ఉద్యోగుల‌పై వేటు ప‌డింది. నిందితురాలు రేణుక, ఆమె భ‌ర్త డాక్యా నాయ‌క్‌ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో గురుకుల పాఠ‌శాల‌లో రేణుక హిందీ టీచ‌ర్‌గా ప‌ని చేస్తుంది. డాక్యానాయ‌క్ వికారాబాద్ జిల్లా కుల్కచ‌ర్లలో ఉపాధిహామీ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. వీరిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పేప‌ర్ లీక్ కేసులో ఏ3గా రేణుక‌, ఏ4గా డాక్యా నాయ‌క్ పేర్లను పోలీసుల చేర్చారు.

హయ్యెస్ట్​ అభ్యర్థులకు పిలుపు?
గ్రూప్–1తో పాటుగా ఏఈ, డీఏఓ వంటి పరీక్షల్లో హయ్యెస్ట్​ మార్కులు వచ్చిన వారిని విచారణకు పిలువాలని సిట్​అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం నిందితుల కస్టడీ కొనసాగుతుండటంతో, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. టీఎస్​పీఎస్సీ పరీక్షలు, వాటికి సంబంధించిన సమాధానాలు, ఎక్స్​పర్ట్స్​ నుంచి వివరాలు తీసుకుని, కనీసం వందకు పైగా మార్కులు సాధించినవారిని విచారించనున్నారు. ప్రస్తుతం వారంతా అనుమానితులుగానే సిట్​ బృందం భావిస్తున్నది. 

వివిధ కోణాలలో
మూడోరోజు నిందితులను ఒకేచోట కూర్చొబెట్టి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులు చెప్పిన ప్రకారం గ్రూప్–-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. గ్రూప్–-1 ప్రశ్నపత్రాలు కమిషన్​కు చేరినట్టు తెలియగానే వాటిని కొట్టేసేందుకు రాజశేఖర్ రెడ్డి పథకం సిద్ధం చేసుకున్నాడు. కమిషన్ కార్యాలయంలోని కంప్యూటర్లను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు మరమ్మత్తులు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగానే ఐపీ అడ్రసులు మార్చాడు. కాన్ఫిడెన్షియల్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మి కంప్యూటర్​ను లీకేజీకి అనువుగా మలుచుకున్నాడు. నిరుడు గ్రూప్–1 పరీరీక్షకు మూడు నెలల ముందు నాలుగుసార్లు ప్రశ్నపత్రాలు కాపీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. నిరుడు అక్టోబరు మొదటివారంలో ఈ ప్రశ్నపత్రాలను చాకచక్యంగా పెన్ డ్రైవ్ కి కాపీ చేసుకున్నట్టు మూడోరోజు కస్టడీలో సిట్ పోలీసులు ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. కాపీ చేసిన ప్రశ్నపత్రాలను ఎవరెవరికి విక్రయించారు, ఎందరు కలిసి విక్రయించారు, ఎంత సొమ్ము తీసుకున్నారు, వారి ఫోన్ నెంబర్లు, వారు ఎక్కడ ఉన్నారనే సమాచారం సేకరించే పనిలో పడ్డారు. 

28 మంది టాప్​స్కోరర్లు అనుమానితులే
నిరుడు అక్టోబర్ లో జరిగిన గ్రూప్–-1 ప్రిలిమ్స్ లో మంచి మార్కులు సాధించిన వారిని సిట్ అనుమానితులుగా చేర్చింది. ప్రాథమికంగా వంద కంటే ఎక్కువ మార్కులు సాధించిన 28 మందితో జాబితా రూపొందించారు. వీరి కాల్ డీటెయిల్స్, వాట్సాప్ వివరాలతో నిందితుల లింకుల కోసం సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గ్రూప్–1 పేపర్ ప్రవీణ్ లేదా మరెవరి ద్వారా అయినా వారికి అందిందా అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇందులో కొందరిని ఇప్పటికే ఐడెంటీఫై చేసినట్లు సమాచారం. టాప్​ స్కోర్​ సాధించిన కొందరు, యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు పొందినట్లు గుర్తించారు. వారిని అనుమానితులుగా తేల్చితే ఎలాంటి పరిణామాలు వస్తాయనే సందిగ్థంలో ఉన్నారు. గ్రూప్ –1 పేపర్ ను కూడా నిందితులు చాలా మందికి సర్క్యులేట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే కమిషన్ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ వినియోగించిన కంప్యూటర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వీరి నుంచి పేపర్లు అందుకున్న వారిని నిందితుల జాబితాలో చేర్చి ప్రశ్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇండ్లల్లో తనిఖీలు
ఈపేపర్‌ లీక్‌ కేసులో కొంత దూకుడు పెంచిన సిట్​.. మంగళవారం హైదరాబాద్‌, మహబూబ్‌నగర్, జగిత్యాలలో సోదాలు చేశారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక ఇళ్లలో సిట్‌ అధికారులు తనిఖీలు చేశారు. రాజశేఖర్ సొంతూరు జగిత్యాల జిల్లా తాటిపల్లికి కూడా అధికారులు వెళ్లారు. రేణుకతో పాటు భర్త నాయక్‌తో కలిసి ముందుగా లంగర్‌హౌస్‌కు వెళ్లారు. సన్‌ సిటీలోని కాళీ మందిర్‌కి వెళ్లి అనుమానితులను ప్రశ్నించారు. రేణుక సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్‌కు సిట్ బృందం వెళ్లింది. బడంగ్ పేటలోని ప్రవీణ్ కుమార్ నివాసం, మణికొండలోని రాజశేఖర్​రెడ్డిల నివాసాల్లో సిట్ పోలీసులు రెండు బృందాలుగా తనిఖీలు చేశారు. ఆ ఇళ్లల్లో లభించిన కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

అధికారుల పాత్రపైనా అనుమానాలు
కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు అసలు రాజశేఖర్​కు యూజర్​ ఐడీ, పాస్​వర్క్​లు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. దీని గురించి సిట్ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. వీరు వాడిన యూజర్ ఐడీ, పాస్​వర్డ్​ కమిషన్​కు చెందిన ఓ అధికారిదని అనుమానిస్తున్నారు. సదరు అధికారి నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డులను దొంగిలించారా లేదా ఆ అధికారే ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి ఉంటే వారిని విచారించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే కోణంలో గత కొద్ది నెలలుగా ప్రవీణ్ పలువురుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ఫోన్లో సంప్రదింపులు జరిపిన వారందరి వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వీరిలో పోటీ పరీక్షలు రాసినవారు ఉంటే విచారణకు పిలవాలని భావిస్తున్నారు. రాజశేఖర్ కూడా ఇదే తరహాలో కొద్ది మంది ఎంపిక చేసుకుని వారికి ప్రశ్నపత్రం అమ్ముకున్నట్లు తెలుస్తోంది.