జస్ట్​ రిలీఫ్​ ముగిసిన కవిత విచారణ

జస్ట్​ రిలీఫ్​ ముగిసిన కవిత విచారణ
  • పది గంటలపాటు ప్రశ్నించిన ఈడీ
  • అత్యవసరంగా ఆఫీసుకు లీగల్​ టీం
  • ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు 
  • మళ్లీ విచారణ ఉంటుందని వెల్లడి
  • తన లీగల్​ టీంను పంపిస్తామన్న కవిత
  • మూడో రోజు ఢిల్లీ, హైదరాబాద్ లో ఉత్కంఠ
  • అక్కడా ఇక్కడా మోహరించిన కేంద్ర బలగాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్​స్కామ్ లో కవిత విచారణ ఆద్యంతం ఉత్కంఠను రేపింది. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.40 గంటల వరకు ఈడీ కార్యాలయంలో విచారణ జరిగింది. వరుసగా మూడు రోజులు కవితను విచారించారు. మూడో రోజు విచారణ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పది గంటల సుదీర్ఘ సమయం తర్వాత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. కవిత దగ్గర నుంచి పది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సాంకేతిక నిపుణులతో పరిశీలించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి విచారణ పూర్తయ్యిందని, తర్వాత మళ్లీ పిలుస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితకు రాతపూర్వకంగా నోటీసు ఇచ్చారు. ఈసారి విచారణకు తాను రాలేనని, తన లీగల్​ టీంను పంపిస్తానని కవిత చెప్పినట్లు సమాచారం. విచారణ తేదీని ఖరారు చేసిన తర్వాత చూద్దామంటూ కవితను వారు బయటకు పంపించారు. 

యాక్టివ్​గా.. ధీమాగా...
మంగళవారం ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయిన కవిత చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, యాక్టివ్ గా కనిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం తుగ్లక్ రోడ్డులోని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈడీ ఆఫీసుకు తీసుకెళుతున్న  తన ఫోన్లను చూపించారు. తాను వాడిన ఫోన్లు తన దగ్గరనే ఉన్నాయని, ఫోన్లు ధ్వంసం చేయలేదని మీడియాకు చూపించారు. ఈడీ ఆఫీస్​కు చేరుకున్న అనంతరం తన లాయర్లు, భర్తతో రెండు నిమిషాలు మాట్లాడారు. అడ్వకేట్ల దగ్గర ఉన్న కాగితాలు తీసుకున్నారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత తన అటెండెన్స్ కోసం కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ నవ్వుతూ కనిపించిన వీడియోలు బయటకు వచ్చాయి. మొదటి రెండు రోజులు కొంచెం ఆందోళనగా.. బిడియంగా కనిపించిన కవిత... మూడో రోజు విచారణకు వెళ్లే సమయంలో మాత్రం భిన్నంగా, ధీమాగా కనిపించారు. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత ఈడీ ముందు నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. 

ఈడీ కార్యాలయంలోకి లీగల్​సెల్​
కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రెటరీ సోమ భరత్‌, ఇతర న్యాయవాదులతో కలిసి  సాయంత్రం ఆరు గంటల సమయంలో  ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.  ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్‌ను ఆఫీసుకు పిలిచారు. కవితకు సంబంధించిన ఆథరైజేషన్‌ సంతకాల కోసం పిలిచినట్టు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్‌ని పంపించేందుకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సోమా భరత్ అందజేసినట్లు తెలుస్తోంది. మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు కవితకు చెప్పినట్లు తెలుస్తున్నది.
 
భారీ బందోబస్తు
కవిత విచారణ నేపథ్యంలో  అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్​లో కేంద్ర బలగాలు మోహరించాయి. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్​లోని ఈడీ కార్యాలయం, బీజేపీ ఆఫీస్​, బీజేపీ నేతల ఇండ్ల ముందు కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కూడా సీఎం కేసీఆర్​ నివాసంతో పాటుగా తెలంగాణ భవన్​ పరిసరాలకు కేంద్ర బలగాలను పంపించారు. ఇదే సమయంలో ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. చుట్టుపక్కల ఉన్న అందర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. మహిళా పోలీసులు సైతం భారీగా చేరుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి తీవ్ర ఉత్కంఠగా మారింది. ఆఫీస్ చుట్టూ చాలా మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా రాత్రి 7 గంటల తర్వాత కేంద్ర బలగాలను ఉపసంహరించారు. కేసీఆర్​ నివాసంతో పాటుగా హైదరాబాద్​లోని ఈడీ ఆఫీస్, బీజేపీ కార్యాలయం, బీజేపీ నేతల ఇండ్ల నుంచి కేంద్ర బలగాలు వెళ్లిపోయాయి. కవిత విచారణ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలోని కొంతమంది, బీఆర్ఎస్ నాయకులు, జాగృతి శ్రేణులు ఢిల్లీలోనే మకాం వేశారు. విచారణ సాఫీగా జరుగుతుండటంతో.. కొంతమంది వెనుదిరిగి వచ్చారు. మంత్రి కేటీఆర్​, శ్రీనివాస్​గౌడ్​తో పాటుగా పలువురు నేతలు మాత్రం అక్కడే ఉన్నారు. విచారణ తర్వాత కవిత సీఎం కేసీఆర్​నివాసానికి చేరుకున్నారు.