సన్‌రైజర్స్ నయా కోచ్ కీలక నిర్ణయం

సన్‌రైజర్స్ నయా కోచ్ కీలక నిర్ణయం
  • ఆ ఆటగాళ్ల కోసం భారీ స్కెచ్
  • డిసెంబర్‌లో ఐపీఎల్ 2024  సీజన్ మినీ వేలం 

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కళానిధి మారన్.. టీమ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గత రెండేళ్లుగా మెంటార్, హెడ్ కోచ్‌గా సేవలందించిన బ్రియానా లారాపై వేటు వేసారు. అతని స్థానంలో న్యూజిలాండ్ దిగ్గజం, ఆర్‌సీబీ మాజీ కోచ్ డానియల్ వెటోరిని నియమించారు. ఆర్‌సీబీ మాజీ కోచ్‌గా ఆ జట్టును ఫైనల్ చేర్చిన డానియల్ వెటోరికి సీపీఎల్, బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్ లీగ్స్‌లో హెడ్ కోచ్‌గా అనుభవం ఉంది. అంతర్జాతీయంగా పలు ఫ్రాంచైజీ లీగ్స్‌లో భాగమైన డానియల్ వెటోరికి టీమ్ ఎంపికపై పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఐపీఎల్ 2023 సీజన్‌ వైఫల్యం నేపథ్యంలో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేసిన వెటోరి.. వారి ఫామ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాడు. 

ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం జరగనున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్రణాళికలను వేగవంతం చేశాడు. గుడ్ బై చెప్పే ఆటగాళ్లతో పాటు దమ్మున్న ఆటగాళ్లను ఎంచుకునేందుకు భారీ స్కెచ్ వేసాడు.  లీగ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకే ఆస్కారం ఉండటంతో దేశీయ ఆటగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ గల ప్రధాన కారణం భారత ఆటగాళ్లు సత్తా చాటడమేనని గుర్తించిన డానియల్ వెటోరి.. సన్‌రైజర్స్‌లో కూడా సత్తా చాటే భారత ఆటగాళ్లను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.  ఇందుకోసం దేశవాళీ టోర్నీలు, ఆయా క్రికెట్ అసోసియేషన్స్‌ల టీ20 లీగ్‌లను ప్రత్యక్ష చూసేందుకు టాలెంట్ స్కౌట్స్‌ను నియమించారు. వీరు భారత్‌‌లో సత్తా గలిగిన యువ ఆటగాళ్లను గుర్తించి వారి గణంకాలను, ఆటతీరుపై వెటోరికి సమాచారం ఇవ్వనున్నారు. తిలక్ వర్మ వంటి అంతర్జాతీయ స్థాయి కలిగిన ఆటగాడిన పక్కనపెట్టుకొని గుర్తించకపోవడంపై వెటోరి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తిలక్‌లా సత్తా చాటే కుర్రాళ్లను వెతికి వారికి ప్రాబబుల్స్ నిర్వహించి జట్టులోకి తీసుకోవాలనుకుంటున్నాడు.