ఎన్నికల వేళ ఎన్ని"కల" లో ?

ఎన్నికల వేళ ఎన్ని"కల" లో ?
  • కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ
  • ఫలితాలను తేల్చి చెప్పలేని పరిస్థితి

హుజూర్ నగర్ ముద్ర:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి పలు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గంలో నిద్రాహారాలు మాని తారాస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆ ప్రచారాలకు తెరపడింది పోలింగ్ తో ఎన్నికల సమరం కూడా ముగిసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల చూపు ఎన్నికల ఫలితాల పైనే ఉంది. ఈ సమయంలో నాయకులు ఎవరు గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేసిన హుజూర్ నగర్ ఓటర్ దేవుళ్ళ తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యనే పోటీ అని గెలుపు గుర్రం ఈ పార్టీలలోనే ఉంటుందని ప్రజల్లో వినిపిస్తున్న మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో 2009 ,2014, 2018 మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. శానంపూడి సైదిరెడ్డి 2019లో ఉత్తమ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎవరు గెలిచినా భారీ మెజారిటీ అయితే దక్కదని స్వల్ప తేడాతోనే విజయం వరిస్తుందని ఓటర్లు గుసగుస లాడుతున్నారు. స్థానికుడైన సైదిరెడ్డి అధికార పార్టీ చేసిన అభివృద్ధిని మంత్రంగా చూపి ఎన్ని ఓట్లు రాల్చగలుగుతాడో సీనియర్ నాయకుడు రాజకీయ ఉద్దండుడైన ఉత్తమ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంత మేరకు తమ వైపు తిప్పుకోగలుగుతాడో వేచి చూడాల్సి ఉంది. హుజూర్ నగర్ లో ఎవరు గెలుస్తారనే దానిపై లక్షల్లో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.

ప్రజా తీర్పు భద్రంగా ఉంది:

తెలంగాణలో ఎన్నికల కోసం ఉపయోగించిన ఈవీఎం మిషన్ లలో ప్రజా తీర్పు భద్రంగా ఉంది. హుజూర్ నగర్ లో పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం మిషన్లను పటిష్ట భద్రత నడుమ సూర్యాపేట జిల్లా లోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఈనెల 3 వ తేది ఆదివారం రోజున హుజూర్ నగర్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టారు అనేది తేలిపోనుంది.