రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో పోలీసుల పాత్ర కీలకం

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో పోలీసుల పాత్ర కీలకం

పోలీస్ శాఖను కొనియాడిన మంత్రి హరీష్ రావు

ముద్రప్రతినిధి, సిద్దిపేట: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పోలీసులకే దక్కుతుందని మంత్రి హరీష్ రావు కొనియాడారు.రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్ష దివాస్ పేరుతో సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆదివారం రాత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో  మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పోలీసింగ్ విధానము, ఇప్పుడున్న విధానాన్ని బెరేజ్ వేస్తూ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రం వస్తే నక్సలైట్ల రాజ్యమవుతుందని మత కలహాలు ఉంటాయని ప్రజల్ని భయపెట్టిన వారికి ఇప్పుడున్న పోలీసు వ్యవస్థతో చక్కని జవాబు చెప్పిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని హరీష్ రావు కొనియాడారు. టెక్నాలజీ విషయంలో, వసతుల కల్పన విషయములో,నిధుల కేటాయింపు విషయంలో, పోలీసు ఉద్యోగాల నియామక విషయంలో ముఖ్యమంత్రి ఎక్కడ రాజీ పడకుండా చర్యలు తీసుకోవడం వల్లే దేశానికి ఆదర్శవంతమైన పోలీసు వ్యవస్థను తయారు చేసుకోగలిగామని మంత్రి హరీష్ రావు అన్నారు.

దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాలు సంఖ్యతో పోలిస్తే, తెలంగాణలో ఉన్న సీసీ కెమెరాలు సంఖ్య కూడా అంతే ఉంటుందన్నారు. పోలీసులు కూడా ప్రజాసేవకులేనని ఆయన కొనియాడారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రజల అందిస్తున్న సేవలను, సైబర్ నేరాల నివారణలో అనుసరిస్తున్న విధానాలను తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న షీ టీమ్స్ భరోసా తదితర కార్యక్రమాలను వివరించారు.

సభలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ,ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ,అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాజు రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు  ఆత్మ కమిటీ చైర్మన్ లు, రైతుబంధు నాయకులు కౌన్సిలర్లు, ఏసీపీలు డిసిపిలు, సిఐలు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి మంత్రి హరీష్ రావు చేతులమీదుగా మోడల్స్ అందజేశారు పలువురికి శాలువాలు కప్పి సన్మానించారు ఆదివారం రాత్రి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో జిల్లా పోలీస్ యంత్రాంగానికి సభికులందరికీ బడ ఖానా పేరుతో విందు భోజనం ఏర్పాటు చేశారు.