వలస జీవుల బతుకు పోరు..

వలస జీవుల బతుకు పోరు..
  • మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలో సిద్దిపేటకు ...
  • రగ్గుల విక్రయంతో ఉపాధి

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: బతుకు పోరులో పేదలకు వలసలు తప్పడం లేదు.. కన్నవారిని,కట్టుకున్న వారిని,ఉన్న ఊరుని వదిలి ఉపాధి కోసం ఎందరో ఇతర రాష్ట్రాల్లో బతకాల్సిన పరిస్థితులు ఇప్పటికీ చూస్తున్నాం.. ఉపాధి కోసం మధ్యప్రదేశ్ నుంచి సిద్దిపేటకు వలస వచ్చారు ఎంతోమంది బడుగు జీవులు.. రగ్గులను విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో తాము జీవిస్తూ తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. శుక్రవారం ఉదయమే పల్లెల్లోకి వెళ్తున్న రగ్గులను విక్రయించే  బడుగు జీవులను 'ముద్ర ప్రతినిధి' పలకరించినప్పుడు తమ జీవన గమనాన్ని వివరించారు.

బతుకు పోరులో తమ పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. అటు ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్కు సమీపంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న షాజపూర్ పాత జిల్లా అగర్ మాల్వా కొత్త జిల్లా పరిధిలోని ఖనాడు మండలం చెక్ బడా బీడ్ గ్రామానికి చెందిన బంజారా కులస్తులం బతుకు పోరులో భాగంగా సిద్దిపేటకు వచ్చామని తెలిపారు.మేట్ సింగ్, కిషన్,దేవీలాల్, రాజన్ తదితరులు 15 మంది ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. హర్యానాలోని పానిపట్టు ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా కాటన్,ఉలెన్ వస్త్రాలను గంపగుత్తగా తెప్పించుకొని ఇక్కడ సిద్దిపేట చుట్టుపక్కల పల్లెలో విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో వారు ఉపాధి పొందుతున్నారు.

చలికాలం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే రగ్గులు చెద్దర్లతోపాటు సాధారణంగా ఉపయోగించే బెడ్ షీట్లను, పరుపు గౌషన్లు, మెత్తగౌషండ్లను జంబుఖానాలను వీరు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. దుకాణాలలో లభించే రేట్ల కంటే నేరుగా ఇండ్ల వద్దకే వచ్చి అందజేసే కాటన్ ఉలెన్ రగ్గులు, గౌషన్ల రేట్లు తక్కువగా ఉండడంతోగ్రామస్తులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ గ్రామాల్లోని ఇండ్ల వద్దకే వచ్చి వారు రగ్గులను విక్రయించడం వల్ల సమయం కలిసి వస్తుందని ప్రజలు స్థానికంగానే కొనుగోలు చేస్తున్నారు.