తెగని పంచాయతీ.. ఆగిన గదుల నిర్మాణం...

తెగని పంచాయతీ.. ఆగిన గదుల నిర్మాణం...
  • న్యాక్ సర్వే ముందు డిగ్రీ కళాశాలకు కొత్త సమస్య
  • 12 గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
  • 250 లక్షల నిధులు ఉన్న మొదలుకాని కొత్త గదుల నిర్మాణం 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: అంగట్లో అన్నీ ఉన్న అల్లునీ నోట్లో శని ఉన్నట్లు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి తయారయింది. వచ్చే  అకాడమిక్ ఇయర్ నుంచి రెండు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన గదుల నిర్మాణం ఇంకా మొదలు కాకపోవడంతో సమస్య ఎదురుకానుంది. రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు కొత్తగదుల నిర్మాణానికి పునాది రాయి వేసి రెండు నెలలు గడుస్తున్నా పనులు ఇంకా మొదలుకాలేదు.పాత గదులు కొన్ని కూల్చివేసి వాటి స్థానంలోనే కొత్తగా నిర్మించాలని ఓవైపు కలెక్టర్ చెబుతుండడంతో కళాశాల యాజమాన్యం మాత్రం న్యాక్ కమిటీకి పంపిన రిపోర్టులో చూపిన గదులు ఇప్పుడే తీసివేస్తే మొదటికే మోసం వస్తుందని ఇవ్వమంటున్నారు. అటు జిల్లా కలెక్టర్, ఇటు కాలేజీ యాజమాన్యం బెట్టు మీద ఉండడంతో, గదుల నిర్మాణానికి మంజూరైన రెండు కోట్ల 50 లక్షలు నిధులు అలాగే మిగిలిపోయాయి. దశాబ్దాల చరిత్ర కలిగి, తెలంగాణకే తలమానికంగా, యూనివర్సిటీ స్థాయిని తలపించే విధంగా ఉన్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన చరిత్ర అందరికీ తెలిసిందే, 1956 జూలై మాసంలో 41 మంది విద్యార్థులతో డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతము 4000 పైగా మనది విద్యార్థిని, విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నారు. దాదాపు 33 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో సుమారు 100 గదులతో చేపట్టిన రాతి కట్టడ భవనానికి అప్పటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు.

సిద్దిపేటలోని మెదక్ రోడ్ లో ఉన్న 220 విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా విశాలమైన  డిగ్రీ కళాశాల భవన సముదాయము సిద్దిపేటకే తలమానికంగా మారింది. బీఏ,బీకాం, బీఎస్సీ, బీబీఏ కాంబినేషన్ లోని 32 యూజీ కోర్సులు, ఎంమ్మే, ఎం కామ్,ఎంఎస్సీ లకు సంబంధించిన పది పీజీ కోర్సులు ఈ డిగ్రీ కళాశాలలో ఇప్పటివరకు నడుస్తుండగా, పీజీలో మరో రెండు కొత్త కోర్సులను ఉన్నత విద్యాశాఖ ఈ ఏడు మంజూరు చేసింది. 2023-24వ సంవత్సర అకాడమిక్ ఇయర్లో వాటిని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మె ఇంగ్లీష్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎనాలాటికల్ కెమిస్ట్రీ కోర్సులు శాంక్షన్ అయ్యాయి.ఒక్కో కోర్సులో 60 మంది విద్యార్థులు చొప్పున అడ్మిషన్లతో వచ్చే ఆర్థిక సంవత్సరం కొత్త కోర్సులను నిర్వహించడానికి 12 గదుల సముదాయం నిర్మాణం కోసం రెండు కోట్ల 50 లక్షలు నిధులను కేటాయించింది.ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 2023 ఫిబ్రవరి 21వ తేదీన కళాశాలలో శంకుస్థాపన చేశారు. అయితే కళాశాల ఆవరణలో ఉన్న ఆరు పాత గదులను కూల్చివేసి వాటి స్థానంలోనే కొత్తగా 12 గదులను నిర్మించాలని జిల్లా కలెక్టర్ కళాశాల యాజమాన్యానికి సూచించడంతో వారు కంగుతిన్నారు. వాస్తవానికి కొత్తగా 12 గదులు మరోచోట నిర్మించాలని కళాశాల యాజమాన్యం కోరుతోంది. నాలుగోసారి న్యాక్ గుర్తింపు కోసం పంపించినటువంటి కళాశాల డయాగ్రమ్ ఇతరత్రా వివరాలన్నీ పాత పద్ధతిలో పరిశీలన టైంలో లేకుంటే ఇబ్బందులు వస్తాయని కళాశాల యాజమాన్యం ఆందోళన చెందుతుంది. కలెక్టర్ మాట కాదనలేక ఇటు పాత భావాన్ని కూల్చివేయలేక యాజమాన్యం సతమతం అవుతుంది. దీంతో కళాశాల అదనపు గదుల నిర్మాణం మొదలు కాలేదు.

సిద్దిపేట డిగ్రీ కళాశాలకు న్యాక్ కమిటీ వచ్చి వెళ్ళాకే ఏ నిర్ణయం తీసుకోవాలనేది నిర్ధారణ కావచ్చు. దీనికి మరో రెండు నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. వచ్చే అకాడమీ ఇయర్లో చేపట్టనున్న కొత్త కోర్సులకు భవన నిర్మాణాలు అప్పటిలోగా అందుబాటులోకి రావడం గగన కుసుమమే అవుతుంది. ఈ విషయమై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని ప్రసాద్ ను 'ముద్ర ప్రతినిధి' వివరణ కోరగా కళాశాలకు రెండు కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరైన విషయం వాస్తవమేనన్నారు. మంత్రి హరీష్ రావు చేతులమీదుగా 12 కొత్త గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయించామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు గదులకు సంబంధించిన ప్లాన్లు, డిజైన్లు తయారు చేశారని చెప్పారు. వాటిని ఎక్కడ నిర్మించాలి? ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలన్న దాన్ని కలెక్టర్ గారి పర్యవేక్షణలో పనులు చేపట్టాల్సి ఉన్నందున ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని,పాత గదులు కూల్చివేస్తే న్యాక్ కమిటీకి చూపించడం ఇబ్బంది అవుతుందని పనులను ఇంకా చేపట్టలేదని తెలిపారు.