టీహెచ్ఆర్ నగర్ కు నెల రోజుల్లో బస్తీ దవాఖాన 

టీహెచ్ఆర్ నగర్ కు నెల రోజుల్లో బస్తీ దవాఖాన 

మంత్రి హరీష్ రావు హామీ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్ధిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్  కాలనీ వాసుల కోసం నెల రోజులలో బస్తీ దవాఖాన ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హమీ ఇచ్చారు. ఆషాడ మాసం పురస్కరించుకుని పట్టణ టీహెచ్ఆర్ నగర్ ముత్యాల పోచమ్మ ఆలయ బోనాల పండుగ ఆదివారం జరిగింది. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు ఆలయ ఐదవ వార్షికోత్సవం, బోనాల పండుగ జాతర పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

టీహెచ్ఆర్ నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రోడ్లు, మురికి కాల్వలకు దశల వారీగా నిధులు విడుదల చేయిస్తానని హామీనిచ్చారు. అమ్మదయతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.కాలనీకి రేషన్ షాపు కావాలని ప్రాంత వాసుల కోరిక మేరకు వెంటనే ఏర్పాటు చేయిస్తానని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ నాయకులు బారాస ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో మంత్రి పేరుతో( తన్నీరు హరీష్ రావు నగర్) టి హెచ్ ఆర్ నగర్ కాలనీ గతంలోనే ఏర్పాటు చేశారు.

వైశ్య సదన్, గౌడ సంఘ భవనాల సందర్శన
సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ లో ఉన్న సుభాష్ నగర్ పోచమ్మ దేవాలయం సందర్శన అనంతరం మంత్రి హరీష్ రావు వైశ్య సదను భవనాన్ని గౌడ సంఘ కళ్యాణ మండప భవనాన్ని సందర్శించారు. పనులను త్వరితగతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.