సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ల దౌర్జన్యం...

సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ల దౌర్జన్యం...
  • ఓటెండర్ విషయంలో వాపస్ తీసుకోవాలంటూ తోటి కాంట్రాక్టర్ ఇంటి పై దాడి...
  • గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఘటన.
  • వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు..
  • సింగరేణి ఆర్ జి -1 లో కలకలం.

ముద్ర, పెద్దపల్లి ప్రతినిధి:-ఒక టెండర్ విషయంలో రింగుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు బరితెగించారు.  తమతో కలవకుండా ఆన్లైన్ లో టెండర్ వేసిన తోటి నలుగురు సివిల్ కాంట్రాక్టర్లపై దౌర్జన్యంకు పాల్పడిన సంఘటన గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఘటన  సింగరేణి రామగుండం-1 డివిజన్ లో  కలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సింగరేణి రామగుండం 1 ఏరియా పరిధిలో  సింగరేణి ప్రైమరీ పాఠశాల మరమ్మతు పనుల కు సంబంధించి యాజమాన్యం సివిల్ కాంట్రాక్టర్ల వద్ద  నుంచి ఆన్ లైన్ ద్వారా టెండర్లు పిలిచింది.

అయితే ఈ పనులను దక్కించుకునేందుకు సింగరేణి సివిల్ కాంట్రాక్టర్లు ఒక రింగుగా ఏర్పడ్డారు. అయితే వీరిలో నలుగురు కాంట్రాక్టర్లు వీరగంటి నరేందర్, సిహెచ్ విజయ్ కుమార్, మారం సమ్మయ్య, నరేష్ లు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా సివిల్ కాంట్రాక్టర్లు ఒకటై అ టెండర్ ను వాపస్ తీసుకోవాలంటూ కొద్దిరోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో  శనివారం నాడు 40 మంది సివిల్ కాంట్రాక్టర్లు  కలిసి టెండర్ విషయంలో మాట్లాడుదామని ఆ నలుగురు కాంట్రాక్టర్లను  ఫోన్లో సంప్రదించారు. తాము స్థానికంగా లేమని  నరేందర్ అనే కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ వినకుండా మార్కండేయ కాలనీలోని అతని ఇంటి మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు.

అంతు చూస్తామంటూ హెచ్చరించారు. దీంతో భయకంపితులైన  సదరు కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సుగుణాకర్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి సివిల్ టెండర్ల విషయంలో కాంట్రాక్టర్లు భౌతిక దాడులకు  పాల్పడేందుకు తెగించిన సంఘటన అటు సింగరేణిలో కలకలం సృష్టిస్తుంది. ఈ సంఘటనపై సింగరేణి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. టెండర్ విషయంలో తోటి కాంట్రాక్టర్ ఇంటిపై దాడికి పాల్పడేందుకు ఒడిగట్టిన సివిల్ కాంట్రాక్టర్లపై యాజమాన్యం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.