అంబేద్కనగర్‌‌లో అసలు ఏం జరిగింది..?

అంబేద్కనగర్‌‌లో అసలు ఏం జరిగింది..?
  • చిట్టీలు పట్టుకుని నేత చుట్టు తిరిగిన ఓటర్లు
  • డబ్బులు ముట్టలేదనే ఓటింగ్‌కు రాని వైనం!
  • సాయంత్రం ఒక్కసారిగా వచ్చి బారులు
  • రాత్రి 8.15 గంటల వరకు సాగిన పోలింగ్‌
  • అధికారులు నిర్లక్ష్యం.. లీడర్ల ఓవర్‌‌ యాక్షన్ వల్లే ఉద్రిక్తత..?

అంబేద్కనగర్‌‌.. ఇది జనగామ పట్టణంలోని ప్రశాంతమైన ఏరియా.. ఎన్నడూ ఎలాంటి అల్లర్లు, పార్టీల వర్గపోరులేని కనిపించని ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గురువారం రాత్రి ఒక్కసారిగా అలజడి రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్ల నినాదాలతో దద్దరిల్లింది. పోలీసు లాఠీ చార్జ్‌, సైరన్ల మోతలతో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఒక దశలో పోలీసులు  ఫైరింగ్‌ వరకు వెళ్లే పరిస్థితి కనిపించింది. అసలు అంబేద్కనగర్‌‌లో ఏం జరిగింది..? ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? అంటే అధికారుల నిర్లక్ష్యం, లీడర్ల ఓవర్‌‌ యాక్షన్‌ అనే తెలుస్తోంది.   



ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ అసెంబ్లీ నియోజకర్గంలోని మొత్తం 277 పోలింగ్‌ బూత్‌లు ఉండగా పట్టణంలో ని 14వ వార్డు అంబేద్కనగర్‌‌లో 267, 268, 269, 270 నాలుగు బూత్‌లకు ఓటింగ్‌ నిర్వహించారు. గురువారం ఉదయం అన్ని సెంటర్లలాగే అంబేద్కనగర్‌‌ పోలింగ్‌ స్టేషన్లలో కూడా ఓటింగ్‌ షురూ అయ్యింది. అంతటా సమాయానికి పోలింగ్‌ పూర్తయినా 270 బూత్‌లో మాత్రం రాత్రి 8.15 వరకు ఓటింగ్‌ జరిగింది. ఈ సెంటర్లలో 1447 ఓట్లు ఉండగా 1,194 ఓట్లు పోలయ్యాయి. 

చిట్టీలు పట్టుకుని...

ఉదయం నుంచి మందకోడిగా సాగిన పోలింగ్‌ సాయంత్రం ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన వారందరికీ అధికారులు టోకెన్లు ఇచ్చి ఓటింగ్‌ అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఆయా పార్టీలు ఓటర్ల డబ్బులు పంచారు. 270 బూత్‌లోని ఓటర్లకు డబ్బులు అందకపోవడంతో చాలా మంది సాయంత్రం వరకు ఇండ్ల నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. ఇంకొందరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు డబ్బుల కోసం పోల్‌ చిట్టీలు పట్టుకుని స్థానిక నేతల చుట్టూ తిరిగారు. చివరు ఓటింగ్‌ సమయం ముగిసే సమయానికి ఒక్కసారిగా వచ్చి పోలింగ్‌ బూత్‌లో క్యూ కట్టారు. దీంతో వచ్చిన వారందరికీ ఓటింగ్‌ అవకాశం అనివార్యమైంది. 

అధికారుల నిర్లక్ష్యం.. లీడర్ల ఓవర్‌ యాక్షన్​

నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌లో అధికారుల నిర్లక్ష్యం, లీడర్ల ఓవర్‌‌ యాక్షన్‌ కొట్టొచ్చినట్టు కనిపించింది. పోలింగ్‌ ఏర్పాట్లు అధికారులు ముందు నుంచి ఫెల్యూర్‌‌ అయ్యారు. ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందిన నాడు ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. విధుల్లో పాల్గొనే కొందరు ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్‌ కౌంటర్‌‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన వసతి ఏర్పాట్లలో కూడా పూర్తిగా విఫలయ్యారు. ఇక పోలింగ్‌ రోజు కూడా విధుల్లో పాల్గొన్న రెండో శ్రేణి ఉద్యోగులకు టిఫిన్‌, భోజనం అందించలేదని తెలుస్తోంది. దీంతో వారే బయటి నుంచి పార్సిల్స్‌ తెచ్చుకున్నట్టు కొందరు తెలిపారు. అధికారుల తీరు ఇలా ఉంటే.. ఇక ఎన్నిలల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు కూడా ప్రతీ బూత్‌లో ఓవర్‌‌ యాక్షన్‌కు దిగారు. ఎవరికి వారు బలప్రదర్శనకు దిగడంలో పోలింగ్‌ సెంటర్ల వద్ద యుద్ధవాతారణం నెలకొంది. అంబేద్కనగర్‌‌ పోలింగ్‌ సెంటర్లలో ఇదే జరిగింది.

రాత్రి 8.15 గంటలకు ప్రశాంతంగా పోలింగ్‌ పూర్తయినా.. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్న కొమ్మూరి తనయుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి అక్కడకు వచ్చిన హంగామా సృష్టించారు. సీలింగ్‌ ప్రక్రియ సరిగా జరిగిందా లేదా చూస్తానంటూ బూత్‌లో వెళ్లేందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగి లోనికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న బీఆర్‌‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసి తమ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన అంబేద్కనగర్‌‌కు వచ్చారు. అప్పటికే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌ లీడర్లు పల్లా రాకతో మరింత రెచ్చిపోయారు. వీరి చూసి కాంగ్రెస్‌ శ్రేణులు సైతం నినాదాలు చేస్తూ బాహాబహీకి దిగారు. పోలీసులు కంట్రోల్‌ చేసేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ గొడవతో స్థానికులు భయాందోళన గురయ్యారు. ఇన్నేళ్లుగా ఎన్నికలు చూస్తున్నాం.. ఎప్పడు ఎలాంటి గొడవలేని అంబేద్కనగర్‌‌లో లీడర్ల తీరుతోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎలక్షన్‌ ఏజెంట్‌గా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పోటే చేసే అభ్యర్థిగా పల్లా రాజేశ్వరెడ్డిలకు పోలింగ్‌ స్టేషన్‌ చెక్ చేసుకునే వెసలు బాటు ఉంది. ఇద్దరు నేతలు సంయమనం పాటించక ఎవరు ఎక్కడి వెలితే అక్కడికి గుంపులు గుంపులుగా వెళ్లారు. వారి ఓవర్‌‌ యాక్షన్‌ వల్లే జనగామ పోలింగ్‌ ఉద్రిక్తతకు దారిసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

అంబేద్కనగర్‌‌ పోలింగ్‌ బూత్‌ వివరాలు...

బూత్‌   మొత్తం ఓట్లు  పోలైన ఓట్లు
267   914 721
268   844 804
269   1086 874
270   1447 1194