మెదక్ లో కాంగ్రెస్ కు గట్టి షాక్

మెదక్ లో కాంగ్రెస్ కు గట్టి షాక్
  • మంత్రి హరీష్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక
  • మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ సైతం చేరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ లో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. శుక్రవారం పాపన్నపేట మండలం యూసఫ్ పేట్ లో ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి  మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరన్నారు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవని, ప్రజల మీద ప్రేమ ఉండాలి,  ప్రజలకు సేవ చేయాలన్నారు. మెదక్ హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే పద్మ మెదక్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నాడు ప్రధాని ఇందిరాగాంధీ  మాట తప్పారన్నారు. కానీ సీఎం కేసీఆర్ వల్ల ఆశీర్వాదంతో పద్మదేవేందర్ రెడ్డి కృషి వల్ల మెదక్ జిల్లా అయ్యిందన్నారు. మెడికల్ కాలేజీ, రైల్ వచ్చిందన్నారు. 

ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళకోసం నాటి ధర్నాలు చేసే రోజులు నేడు లేవన్నారు. రెండు పంటలకు నీళ్ళు, కరెంటు ఇస్తున్నది కేసిఆర్ కరెంట్ నిరంతరంగా ఇస్తున్నారన్నారు. ఎన్నికల పండగ రావడంతో రకరకాల వ్యక్తులు వస్తున్నారన్నారు. దండగ అన్న వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నాడు. 3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా, 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా అని ప్రశ్నించారు. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయన్నారు. గుంట కూడా ఎండటం లేదన్నారు. కంటి, కరెంటుతో ప్రతి ఇంట్లో వెలుగులు విరాజిమ్ముతున్నాయన్నారు.

కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.  మన పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదన్నారు. పద్మ గారు గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అన్నారు. మెదక్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో గెలుపు కోసం అందరం కృషి చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. 

మామిళ్ళ చేరిక
టిపీసీసీ కో ఆప్షన్ సభ్యులు, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఉద్యమంలో పనిచేసిన మామిళ్ళ ఆంజనేయులుకు రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.