గంగాజలంపై జీఎస్టీ

గంగాజలంపై జీఎస్టీ
  • మినహాయింపు నిచ్చిన కేంద్రంవిపక్షాల విమర్శల నేపథ్యంలో నిర్ణయం?

న్యూఢిల్లీ: ప‌విత్ర గంగాజ‌లంపై 18 శాతం జీఎస్టీ విధించ‌డం ప‌ట్ల బీజేపీ ప్రభుత్వమే ల‌క్ష్యంగా విప‌క్షాలు విరుచుకుప‌డ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కిత‌గ్గింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు గంగా న‌దిలో స్నానం చేసి పూజాదికాలు నిర్వ‌హించే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. గంగాజ‌లంపై జీఎస్టీని మిన‌హాయించామ‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నులు, క‌స్ట‌మ్స్ బోర్డు (సీబీఐసీ) గురువారం వివ‌ర‌ణ ఇచ్చింది.

బీజేపీ ప్రభుత్వం ప‌విత్ర‌ గంగాజ‌లంపై18 శాతం జీఎస్టీ విధించ‌డం దారుణ‌మని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మండిప‌డ్డారు. ప్ర‌తి భార‌తీయుడి పుట్టుక నుంచి మ‌ర‌ణం వ‌ర‌కూ మోక్ష సాధనంగా గంగా మాత‌ను భావిస్తార‌ని ఖ‌ర్గే ట్వీట్ చేశారు. మోడీ మీరు ఈరోజు ఉత్త‌రాఖండ్‌లో ఉండ‌గా, మీ ప్ర‌భుత్వం ప‌విత్ర గంగాజ‌లంపైనే 18 శాతం జీఎస్టీ విధించింది. గంగా జ‌లాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆర్డ‌ర్ ఇచ్చిన వారిపై ప‌న్ను భారం అధికంగా ఉంటుంద‌ని, ఇది మీ ప్ర‌భుత్వ నిర్వాక‌మ‌ని ఖ‌ర్గే ఆరోపించారు. గంగా జ‌లంపై 18 శాతం జీఎస్టీ విధించ‌డాన్ని చ‌త్తీస్‌ఘ‌ఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బ‌ఘేల్ త‌ప్పుప‌ట్టారు. ఇది న‌కిలీ రామ భ‌క్తి అంటూ విమర్శ‌లు గుప్పించారు. గంగాజలంపై ప‌న్ను భారం రాజ‌కీయ మ‌లుపు తీసుకోవ‌డంతో కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. గంగాజ‌లానికి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని సీబీఐసీ ట్విట్ట‌ర్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చింది.