చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్  ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్-స్టార్ హాస్పిటల్స్  ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

సినీ రంగంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అనగానే మదిలో మెదిలే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. కేవలం తన అభిమానులు, సినీ పరిశ్రమ కార్మికులు అనే కాదు దాదాపు అన్నివర్గాల ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడంలో ఆయనది అందె వేసిన చేయి. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ కార్మికులు సహా అభిమానులు అవసరార్థులైన ప్రజలను ఎంతగానో ఆదుకున్న ఆయన సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఇతర ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ కార్మికులు, నటులు, సహా సినీజర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రఖ్యాత స్టార్ హాస్పిటల్ భాగస్వామ్యంతో వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందిస్తోంది. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఇంతకుముందే చిరంజీవి ప్రకటించగా  మొదటి శిబిరం జూలై 9న (నేడు) హైదరాబాద్ లో దిగ్విజయం అయింది. తదుపరి జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని ఏర్పాటు చేసారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్  అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి. ఎన్. ఆదిత్య, దొరై  తదితరులు పాల్గొన్నారు.