విధుల్లో నిబద్ధతే ఉద్యోగుల గుర్తింపు పెంచుతుంది

విధుల్లో నిబద్ధతే ఉద్యోగుల గుర్తింపు పెంచుతుంది
  • సుపరిపాలన దినోత్సవ సభలో
  • జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుతాయని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు జిల్లా కలెక్టరేట్లో జరిగిన సుపరిపాలన దినోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ , జిల్లా కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, జిల్లా అటవీ అధికారి తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కేవలం రూల్స్ ప్రొసీజర్ మాత్రమే ఫాలో చేస్తూ మొక్కుబడిగా విధులు నిర్వహిస్తే జీవితంలో సంతృప్తి లభించదని, రిటర్మెంట్ అయ్యాక ఏం చేశామని ఆలోచించే బదులు, బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నప్పుడే తమ శక్తి నంతా ఉపయోగించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన సూచించారు. పరిపాలనలో, సుపరిపాలనలో ఉన్న వ్యత్యాసాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి విడమర్చి చెప్పారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలనా వికేంద్రీకరణ ఆర్థిక స్వాలంబన వసతుల కల్పన జరగడంతో ప్రభుత్వ యంత్రాంగము గడపగడపకు వెళ్లి సేవలందించిందని అన్నారు. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పోలీసుల విలువను పెంచేది  క్రమశిక్షణ, ప్రజలతో మెలిగే తీరేనన్నారు. కేవలం కేసులు, లాఠీలు, తూటాలు,చలాన్లు  మాత్రమే ఇప్పటి పోలీసు విధానం కాదని, ప్రజల సేవలో భాగస్వామ్యమై శాఖకు మంచి పేరును తేవడంతో పాటు, అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. ఇది ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు అయ్యాక జరిగిన గొప్ప మార్పు అని సిపి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను ఈ సభలో తెలిపారు.