మైహోమ్ వారసుడికి షాక్

మైహోమ్ వారసుడికి షాక్
  • మైహోమ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేం
  • ఏడోసారి మైహోమ్ దరఖాస్తు తిరస్కరణ
  • సర్వేనెంబర్లు మార్చి 8వసారి నేడు గ్రామపంచాయితీ లో దరఖాస్తు
  • తెరపైకి మైహోం భూమాయ రిపోర్ట్

మేళ్లచెరువు ముద్ర : మైహోం సంస్థ వారసుడు జూపల్లి రంజిత్ రావుకు ప్రభుత్వం మరోమారు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వివాదాస్పద భూముల్లో మైహోం సంస్థ చేపడుతున్న నిర్మాణాలు అక్రమమే అని డిటిసిపి, పంచాయతీరాజ్ వ్యవస్థ నిగ్గు తేల్చింది. ఈ మేరకు మైహోం సంస్థ గత నెల 30వ తేదీన అపార్ట్మెంట్ల నిర్మాణాల కోసం పెట్టుకున్న 7వ సారి జూపల్లి రంజిత్ రావు దరఖాస్తును తిరస్కరించింది.ఈరోజు ఉదయం తిరస్కరించడమే తరువాయి సాయంత్రం మరల అనుమతుల కోసం మైహోం యాజమాన్యం జూపల్లి రంజిత్ రావు పేరిట దరఖాస్తు చేసుకుంది. ఏడుసార్లు మైహోమ్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించగా ముచ్చటగా ఎనిమిదో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సర్వే నెంబర్లు మార్చి మళ్ళీ దరఖాస్తు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 1057/ఐ లో గల 3 ఎకరాల విస్తీర్ణంలో 6అంతస్తుల భారి అపార్ట్మెంట్ ను మైహోమ్ సంస్థ నిర్మించింది. అయితే ఈ భూమి భూదాన్, సీలింగ్ భూముల్లో ఉండటంతో ప్రభుత్వం ఇప్పటివరకు భవన నిర్మాణానికి లేటువంటి అనుమతి ఇవ్వలేదు. అనుమతుల కోసం మైహోం సంస్థ మంత్రుల నుండి ఒత్తిడి చేసినా, పలు ఫోర్జరీ పత్రాలను  సృష్టించినప్పటికీ నిర్మాణం పూర్తయిపోయిన భవనాలకు కొత్తగా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. గత ఏడు దరఖాస్తుల్లో ఈ భవన నిర్మాణం 1057 సర్వే నెంబర్ గల భూమిలో ఉన్నట్లుగా చూపించిన మైహోం సంస్థ తాజాగా 09-06-2023న పెట్టుకున్న దరఖాస్తులో మాత్రం ఈ అపార్ట్మెంట్లు సర్వేనెంబర్ 1057తో పాటు 1063,1064,1066 సర్వే నెంబర్లల్లో గల భూముల్లో ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. సర్వే మ్యాప్ లో అపార్ట్మెంట్లు నిర్మించనున్న ప్రదేశాన్ని చూపించలేదు.గూగుల్ మ్యాప్ లో మాత్రం ఇప్పటికే పూర్తి చేసి ఉన్న అపార్ట్మెంట్లను ఖాళీ స్థలంగా చూపించారు. అపార్ట్మెంట్ల నిర్మాణాల కోసం ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకొనప్పటికీ 2014లో 2.78-MTPA-3.043MTPA యూనిట్-2 సిమెంట్ ప్లాంట్ కోసం తీసుకున్న పర్యావరణ అనుమతుల పత్రాలను జతపరిచింది.

తెరపైకి మైహోమ్ భూమాయ

2017లో అప్పటి కమ్యూనిస్టుల పెట్టుబడులతో నిర్వహించిన 10టీవీ మరియు నవతెలంగాణ   వార్తాపత్రికలో మైహోమ్ రామేశ్వరరావు భూకబ్జాలపై ప్రచురితమైన మైహోం భూమాయ కథనంపై జరిగిన విచారణ పత్రాలను ఈ దరఖాస్తు వెంబటి జతపరిచింది. భూకబ్జాల వార్తలు ప్రచురించిన అనంతరం నవతెలంగాణ,10టీవీ సంస్థలను పూర్తిగా మైహోమ్ సంస్థ ఖరీదు చేసింది. ఆనాటి పత్రిక కథనం పై ఆర్డిఓ కోదాడ, ల్యాండ్ సర్వే జిల్లా అధికారి విచారణ ప్రకారం మేళ్లచెరువులోని గల 128 ఎకరాల సీలింగ్ భూముల ఫైలు మిస్ అయినట్లు పేర్కొన్నారు. మేళ్లచెరువు నుండి చౌటపల్లికి వెళ్లే రెండు డొంకదారులను మూసివేసినట్లు తెలిపారు.భూదాన్ భూములకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ రిపోర్ట్ కి ప్రస్తుత దరఖాస్తు కి ఎటువంటి సంబంధం లేదని అధికారులు పేర్కొంటున్నారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేవు అని తేల్చి చెబుతున్నారు. ఈరోజు మైహోం సంస్థ అధికారులు తన కార్యాలయంలో పెట్టుకున్న దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేసినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి పేర్కొన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేసే అధికారం గ్రామపంచాయతీదే అని డిటిసిపి జిల్లాఅధికారి రాహుల్  స్పష్టం చేశారు. వివాదాస్పద భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను డిమాలిష్ చేయడం తప్ప అనుమతులు ఇవ్వలేమని డిటిసిపిఓ పేర్కొన్నారు.