సినీ రంగంలో… గద్దర్‌ గళం

సినీ రంగంలో… గద్దర్‌ గళం

గద్దర్‌ గొంతు తెలంగాణలోని పల్లె పల్లెకూ, ఇంటింటికీ సుపరిచితమే. శ్రమజీవుల కష్టాన్నే వస్తువుగా, మాటనే పాటగా మలిచిన గొప్ప గాయకుడు. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచి ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం…. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన తన ఆటపాటలతో ఎలుగెత్తి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. గద్దర్ నేడు అమరుడయ్యారు. అయినా ఆయన పాట శాశ్వతంగా ప్రజల గుండెల్లో పోతుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు. గద్దర్. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీని కోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు.

ఆ తరువాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్‌ కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. దర్శకుడు బీ.నర్సింగరావు ప్రోత్సాహంతో అనేక పాటలు స్వరపరిచారు. ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజ పరిచింది. తన పాటతో గద్దర్‌ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్‌ అందుకున్నారు. ఒరేయ్‌ రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డు ను స్వీకరించారు.

గద్దర్ పాడిన వాటిలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాట చాలా స్పెషల్. ఎందుకంటే 1979లో అంటే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి ముందు ఆయన ఈ పాట పాడారు. ‘మా భూమి’ సినిమాలోని ఈ సాంగ్.. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ‘అడవి తల్లికి వందనం’, ‘పొద్దు తిరుగుడు పువ్వా’, ‘భద్రం కొడుకో’, ‘జం జమలబరి’, ‘మేలుకో రైతన్న’ లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.

చివరగా ఆయన నటించిన చిత్రం “ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం “ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాసారు. గద్దర్ మరణవార్త తెసుకున్న ఈ చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు.