దోపిడి దొంగలను ఇంటికి పంపాలి

దోపిడి దొంగలను ఇంటికి పంపాలి
  • కాషాయ జెండా ఎగురవేయాలి
  • మాజీ మంత్రి గుండె విజయ రామారావు

ముద్ర. స్టేషన్ ఘన్ పూర్: ఉద్యమం పేరుతో రాజకీయ ఉద్యోగాలు సంపాదించుకొని అందిన కాడికి దోచుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ దోపిడీ దొంగలను ఇంటికి పంపాలి.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గుండె విజయ రామారావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రం మా గార్డెన్స్ లో ఆదివారం రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, చిలుక విజయరావు లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల తో సాగింది అన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని ప్రాణ త్యాగాలు చేస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి అన్నారు. రాజకీయ ఉద్యోగాలు సంపాదించుకున్న కెసిఆర్ కుటుంబం దోపిడీ దొంగలుగా, దారిదోపిడిగాళ్లుగా అందిన కాడికి దోచుకున్నారని ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా దోచుకుని, దాచుకున్న ధన అహంకారంతో ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా దుయ్యబడుతున్న టిఆర్ఎస్ నేతలను ఓట్ల కోసం వస్తే నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా, 6,800 స్కూలు సింగిల్ టీచర్ తో నడుస్తున్న, 4,200 జూనియర్, డిగ్రీ కాలేజీలలో సిబ్బంది కొరత ఉన్న అటు విద్యాశాఖ మంత్రి గాని ఇటు ముఖ్యమంత్రి గాని పట్టించుకోవడం లేదన్నారు. దేవాదుల సృష్టికర్తగా చెప్పుకుంటున్న కడియం శ్రీహరి నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తిచేసి అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని ఉద్యమం చేసిన వాళ్లను టిఆర్ఎస్ పార్టీ విస్మరించిందన్నారు.2004, 2009, 2014, 2019లో ఎన్నికల అఫిడవిటిలో మీరు చూపిన ఆదాయం ఎంత? ప్రస్తుతం మీ ఆదాయం ఎంత అని కెసిఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి లను ప్రశ్నించారు. ఉద్యమకారులపై ఉక్కు పాదం మోపిన టిఆర్ఎస్ నేతల బడాయి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని టిఆర్ఎస్ ను ఓడించి బిజెపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. టిక్కెట్ కోసం పోటీ పడుతున్న మాలో ఎవరికి టికెట్ వచ్చినా అందరం సమిష్టిగా కృషి చేసి టిఆర్ఎస్ను ఓడించి కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు. నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇనుగాల యుగంధర్ రెడ్డి, బూర్ల విష్ణు, వలి పాషా, బుర్ర తిరుపతి, గంగిడి శ్రీనివాస్ రెడ్డి, రాజు నాయక్, రడపాక ప్రదీప్, మజ్జిగ లింగం, పులి రవి, తౌటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.