బీఆర్‌‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌‌గా అరవింద్‌రెడ్డి

బీఆర్‌‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌‌గా అరవింద్‌రెడ్డి
ముద్ర ప్రతినిధి, జనగామ: బీఆర్‌‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌‌ లీడర్‌‌గా 7వ కౌన్సిలర్ మల్లవరపు అరవింద్‌రెడ్డిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వలు జారీ చేసినట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఫ్లోర్‌‌ లీడర్‌‌ మార్పు కోసం అందరు కౌన్సిలర్ల నిర్ణయం మేరకు పార్టీకి లేఖ రాయగా దానిని పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్‌రెడ్డి చెప్పారు. నేటి నుంచి అరవిందర్‌‌ రెడ్డి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. 
 
 అసమ్మతి ఎఫెక్టేనా..? 
జనగామ మున్సిపల్‌ చైర్‌‌ పర్సన్‌ చైర్‌‌ పర్సన్‌ పోకల జమునపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌తో పాటు ఫ్లోర్‌‌ లీడర్‌‌ మారబోయిన పాండును మార్చాలని అసమ్మతి లీడర్ల గట్టిగా పట్టుబట్టారు. ఈ మేరకు కలెక్టర్‌‌కు కూడా లేఖ అందించారు. అసమ్మతిపై చైర్‌‌పర్సన్‌ జమున కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా దానికి బ్రేకులు పడినట్లయ్యింది. అయితే అసమ్మతి సెగను చల్లార్చేందుకు బీఆర్‌‌ఎస్‌ హైకమాండ్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తాజా పరిణామాలు చూస్తే తెలుస్తోంది. ఈ క్రమంలో మొన్నటి వరకు ఫ్లోర్‌‌ లీడర్‌‌గా ఉన్న మారబోయిన పాండును తొలగించి అసమ్మతి వర్గంలో ఉన్న 7వ వార్డు కౌన్సిలర్‌‌కు అరవింద్‌రెడ్డి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.