నా ఆస్తులు నిరూపిస్తే... నియోజకవర్గ దళితులకు రాసిస్తా

నా ఆస్తులు నిరూపిస్తే... నియోజకవర్గ దళితులకు రాసిస్తా
  • నీవు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు జరిగిన ఎన్కౌంటర్లకు నువ్వు బాధ్యత వహిస్తే?  నేను బాధ్యత వహిస్తా..!
  •  దిగజారుడు రాజకీయాలు వద్దు రాజయ్య
  • మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గుంటూరు, బెంగళూరు, సింగపూర్, మలేషియాలో నాకు ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే నా ఆస్తుల్ని నియోజకవర్గ దళితులకు రాసిస్తానని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రకటించారు. ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై గత రెండు మూడు రోజులుగా చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకు సోమవారం సోమవారం దీటుగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే రాజయ్య నీకు దమ్ము, ధైర్యం ఉంటే నాతో రాజకీయంగా ఎదుర్కో నా కూతురు జోలికి ఎందుకు వస్తున్నావ్ అని ప్రశ్నించారు. నా కుటుంబం జోలికి వస్తే నేను మీ కుటుంబం జోలికి రావాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ఉరివేసుకొని చస్తావు అంటూ తీవ్రంగా స్పందించారు.  దేవాదుల సృష్టికర్త అని నా అభిమానులు గోడలపై రాస్తే ఎన్కౌంటర్లో సృష్టికర్త కడియం శ్రీహరి అని రాజయ్య అనడంలో విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లకు నువ్వు బాధ్యత వహిస్తే నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్కౌంటర్లకు నేను బాధ్యత వహిస్తాను అన్నాడు. ఎన్కౌంటర్లకు బాధ్యుడిని నేను కాదు ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని కాదు హోంశాఖ మంత్రిని అంతకు కాదు అన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపిస్తున్న నువ్వు  ఏ గ్రామంలో అభివృద్ధి పై చర్చ పెడతావో అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు. మోడల్ కాలనీలు, పెద్ద చెరువు, జూనియర్ కాలేజీ, గురుకుల పాఠశాల,132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్  ప్రతి గ్రామములో వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, లింకు రోడ్లు పాఠశాల అదనపు గదులు, హాస్టల్ భవనాలు అన్నీ నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసినవే అన్నారు. నేను నీలాగా కమిషన్లు తీసుకొని పనులు, పదవులు ఇవ్వలేదన్నారు. నువ్వు తీసుకున్న కమిషన్లకు నా దగ్గర సాక్షాలు ఉన్నాయని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ రోజు తప్పకుండా వస్తుందని జోష్యం చెప్పారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అవినీతి, అక్రమాలు అధిష్టానం దృష్టికి వెళ్తున్నాయని రేపు అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  నాపై చేసిన ఆరోపణలకి ఆధారాలు వారంలోగా చూపాలని లేనిపక్షంలో బె శరత్ గా క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎడవెల్లి కృష్ణారెడ్డి, చింతకుంట్ల నరేందర్ రెడ్డి బెలీద వెంకన్న, బూర్ల లత శంకర్, రాపోలు మధుసూదన్ రెడ్డి, రాంబాబు, రాజేష్ నాయక్, నీల గట్టయ్య, బాబు, నాగరాజు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.