ముదిరాజులను గుర్తించాలి

ముదిరాజులను గుర్తించాలి
  • చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి
  • రిటైర్‌‌ కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి

ముద్ర ప్రతినిధి, జనగామ: తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలు ఉన్న ముదిరాజులను అన్ని పార్టీ గుర్తించాలని, చట్టసభల్లో తమకు సముచిత స్థానం కల్పించాలని రిటైర్ కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి ముదిరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం జనగామ జిల్లా ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‌జరిగిన ముదిరాజుల చైతన్య సదస్సుకు పిట్టల కుమార్ అధ్యక్షత వహించగా భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన మొట్టమొదటి పోలీస్ కిష్టయ్య తమ వాడే అని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన ముదిరాజ్ కుటుంబాలు కొందరికి కనిపించడం లేదని పరోక్షంగా అధికార పార్టీని విమర్శించారు. 

రాష్ట్ర రాజకీయాల్లో ముదిరాజులను కావాలని వెలివేశారని ఆరోపించారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కు కాపాడుకుందుకు ముదిరాజులు ఐక్యం కావాలని, తమను గుర్తించని రాజకీయ పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్యఅతిథి హైకోర్టు న్యాయవాది చింతల యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీసీలకు తీరమని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ముదిరాజు నాయకులు కీర్తి వీరేందర్, పిట్టల సురేశ్‌, పట్టణ యువత నాయకులు కాగితాల అజయ్, గడ్డం శ్రీనివాస్, ప్రొఫెసర్ నరసింహులు, మాజీ ఉద్యోగుల సంఘం నాయకులు రాజయ్య, కీర్తి లక్ష్మీనర్సయ్య, తుపాకులు రాములు, కట్ల సదానందం, పిట్టల సత్యం, సానబోయిన ఉమేశ్, గుర్రపు వెంకటేశ్వర్లు, చిక్కుడు రాములు, వంగాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 కదిలిన ముదిరాజులు..
ముదిరాజు చైతన్య సదస్సుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సభాస్థలి కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యంలో వచ్చిన ముదిరాజులతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ర్యాలీలో బోనాల ప్రదర్శన, సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.