ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌
  • ఆరు కిలలో గంజాయి, నాలుగు సెల్‌ ఫోన్లు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన వెస్ట్ జోన్‌ డీసీపీ సీతారాం

ముద్ర ప్రతినిధి, జనగామ: ఆంధ్ర, ఒడిశా బార్డర్‌‌ నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను నర్మెట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జనగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ సీతారాం ఈ కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోకి కరీమాబాద్‌, గోవిందరాజులగుట్టకు చెందిన కూకట్ల నిశాంత్‌, బొల్లి లక్ష్మణ్‌, భూపాలపల్లికి చెందిన మహమ్మద్‌ అజార్, తొగరి నిఖిల్‌, మహబూబాబాద్‌ జిల్లా మడిపల్లికి చెందిన సిరబోయిన కృష్ణమూర్తి, నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన చీకటి కిరణ్‌ ఈజీ మనీ కోసం గంజాయి దందా మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి ఉమ్మడి వరంగల్‌లో విక్రయిస్తున్నారు. మంగళవారం జనగామ జిల్లాలోని నర్మెటలో  సరుకు అమ్మేందుకు వచ్చారు. మండల శివారులోని దుర్గమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. వీరి వద్ద నుంచి రూ.1.20 లక్షల ఎండు గంజాయి, నాలుగు సెల్‌ ఫోన్లు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 

పద్ధతి మార్చుకోవాలి...
గంజాయి సేవించే వారు తమ పద్ధతి మార్చుకోవాలని లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ సీతారాం హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి దందా పెరిగిందని, దానిని అరికట్టేందుకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈనెలలో రెండు గంజాయి ముఠాలను పట్టుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న 56 మంది కస్టమర్లను గుర్తించామని వివరించారు. త్వరలో ఫ్యామిలీ మెంబర్లతో వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. గంజాయి ముఠాకు పెద్ద చైన్‌ లింక్‌ ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఛేదించి జనగామను గంజాయి ఫ్రీ జిల్లా మార్చడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని చెప్పారు. సమావేశంలో జనగామ ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి, నర్మెట సీఐ నాగబాబు, ఎస్సై షేక్‌ జానీ పాషా, హెడ్‌కానిస్టేబుల్‌ గట్టయ్య, కానిస్టేబుళ్లు ధనుంజయ్‌, ప్రవీణ్, రహమత్‌ అలీ, హమీద్‌, రాజు, రమేశ్‌, గలిబ్‌ తదితరులు పాల్గొన్నారు.