జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
  • టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జనగామ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి
  • సమస్యలపై సీఎం కేసీఆర్‌కు పోస్ట్ కార్డులు

ముద్ర ప్రతినిధి, జనగామ: సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వేర్చడంతో పాటు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జనగామ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆ సంఘం జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు పోస్టు కార్డులు వేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది ఏళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కెటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం.. జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు అవి అన్ని కార్పొరేటు వైద్యశాలలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలోయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురిగెల భిక్షపతి యాదవ్, జిల్లా కోశాధికారి ఓరుగంటి సంతోష్ కుమార్, టెంజు జిల్లా అధ్యక్షుడు కేమిడి ఉపేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ హింగే మాధవరావు, సీనియర్ జర్నలిస్టులు పార్నంది వెంకటస్వామి, సందేన రమేశ్‌, బండి శ్రీనివాస్‌రెడ్డి, సద్దనపు భాస్కర్, ఉప్పలంచి నరేందర్, దండిగ భాస్కర్, ఏజాజ్, మంగ శంకర్, రాజు, సాగర్, శ్రీనునాయక్, సుప్రీమ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.