నా వద్ద పనిచేస్తే తరిమెవాడిని 

నా వద్ద పనిచేస్తే తరిమెవాడిని 
  • ఇద్దరు జిల్లా అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
  • గొంతు నొక్కుతున్నారని బిజెపిలో చేరిన జడ్పిటిసి భైఠాయించి నిరసన వాకౌట్
  • వాడి వేడిగా మెదక్ జడ్పి సమావేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:నా డివిజన్ లో ఉంటే ఒక్క రోజు ఉండనీయకుంటి... సెలవు పెట్టుకోకపోతే వెంటబడి తరిమెవాడిని... పనిచేయకుండా ఇబ్బంది పెడుతున్నారు.... చాలా కోపంతో వచ్చా కానీ మీ అదృష్టం బాగుండి బతికిపోయారు.... మీరు మా వద్ద పనిచేసి వచ్చారు, మీ సంగతి తెలుసు నోరువిప్పాలా... ఈ వ్యాఖ్యలు చేసిందివరో కాదు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి ఇద్దరు మెదక్ జిల్లా అధికారులపై జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేస్తు సభ సాక్షిగా నీలాదీశారు. మరో వైపు అన్ని శాఖల సమీక్ష సందర్బంగా సమస్యలపై తనను మాట్లాడనీయకుండా అధికార పార్టీ సభ్యులు గొంతు నొక్కుతున్నారని నిజాంపేట జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ (ఇటీవల బిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరారు) వేదిక ముందు భైఠాయించి నిరసన తెలిపి వాకౌట్ చేశారు. కాగా సమస్యలపై చర్చించకుండా రాజకీయంగా మాట్లాడటం సారికదాని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పిటిసీలు, ఎంపిపిలు ఖండించారు.

సోమవారం మెదక్ జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం చైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన కలెక్టరెట్ ఆడిటరియంలో జరిగింది. ఈ సమావేశంలో నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, హాజరయ్యారు. శాఖల సమీక్షలో భాగంగా పంచాయతీ రాజ్ జిల్లా ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడ్తుండగా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసినా పనులు చేయించడం, బిల్లులు ఇప్పించడంలో మెదక్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు శాఖల మధ్య ఒక లెటర్ కోసం 18 నెలల సమయం పట్టిందన్నారు.నిధులున్నా లేవని చెప్పడం షోచనీయమన్నారు. ఎస్టిమేషన్, మంజూరు, అగ్రిమెంట్, పనులు చేయించడం, బిల్లు రికార్డు చేసి, బిల్లులు ఇప్పించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదన్నారు. మేము చొరవ చూపే వరకు బిల్లులు రావడం లేదని, అవస్థలుపడుతున్నారు, పనులు పెండింగ్ లో ఉంటున్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు పనులు చేయకపోతే అభివృద్ధి ఆగిపోవాలా అంటూ ప్రశ్నించారు. చాలా ఉబ్బందులు పెడుతున్నారు...నా డివిజన్లో ఉంటే ఒక్క రోజు ఉండనీయకపోయేది సెలవు పెట్టుకోకపోతే వెంటబడి కొట్టేవాడినంటూ తీవ్రంగా ఈఈ సత్యనారాయణ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. మీరు రాజకీయం చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాండి, మీరు మా వద్ద పనిచేశారు, నేను మాట్లాడితే బాగుండదంటూ జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబాపై ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇద్దరినీ క్లాస్ తీసుకోవడానికే వచ్చానన్నారు. కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ ఎమ్మెల్యే, ఎంపిపిలతో సమీక్షించి బిల్లులు సిపిఓకు పంపాలని ఈఈని ఆదేశించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఒక్కసారిగా అధికారులు, ప్రజాప్రతినిధులు అవక్కయ్యారు.

జెడ్పిటీసి భైఠాయించి నిరసన, వాకౌట్

శాఖల సమీక్షలో నిజాంపేట్ జెడ్పిటీసి పంజా విజయ్ కుమార్ పలు సమస్యలపై లేవనెత్తారు. వ్యవసాయం, విద్యాశాఖ, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల సమీక్షలో విజయ్ కుమార్ అధికారులను నీలాదీశారు. రైతుల రుణమాఫీ, ఎరువుల సమస్యలున్నాయి, మెదక్ ర్యాక్ పాయింట్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇది మభ్యపెట్టడానికేనా అంటూ డిఎఓను ప్రశ్నించారు. కలెక్టర్ షా మాట్లాడుతూ ఎక్కడా ఎరువుల సమస్య లేదు, రామాయంపేటలో కూడా స్టాక్ పెట్టామని సమాధానమిచ్చారు.  ఎంపిపి హరికృష్ణ, జెడ్పిటిసి రమేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు యూసఫ్ లు మాట్లాడుతూ.... గత ఏడాది కంటే ఎక్కువ యూరియా సరఫరా చేశారు, కెసిఆర్ నెతృత్వంలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారన్నారు. ఈ సమయంలో కొద్దిపేపు హరికృష్ణ వర్సెస్ విజయ్ కుమార్ గొడవ జరిగింది. సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని విజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. జెడ్పిటీసి యాదగిరి మాట్లాడుతూ... ఒకప్పుడు యూరియా కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సి వచ్చేదన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్, సమయం వృధా చేయరాదన్నారు. విద్యా శాఖ సమీక్షలో సైతం విజయ్ కుమార్ సమస్యలపై స్పందించారు. రేగోడ్ మండలంలో ఉపాధ్యాయులను నియమించాలని జెడ్పిటిసి యాదగిరి కోరారు. మెదక్ లో మెడికల్ కళాశాల మంజూరు సంతోషం కానీ జిల్లా ఆసుపత్రి ఉందా లేదా అని ప్రశ్నించారు. డిసిహెచ్ డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ... ప్రస్తుతం 200  పథకాలున్నాయి, కళాశాలకు 1 ఏడాది, ఆసుపత్రికి రెండేళ్ల సమయం ఉందన్నారు. నిబంధనల మేరకు జరుగుతందన్నారు. ఎంపిపి హరికృష్ణ స్పందిస్తూ మనకు మెడికల్ కళాశాల కావాలా? వద్దా? అంటూ ప్రశ్నించారు. సమస్యలపై చర్చించకుండా సభా సమయం వృధా చేస్తున్న విజయ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని చైర్పర్సన్, కలెక్టర్ ను కోరారు. కండువా మారితే మనిషి మారడు, సమస్యలపై అడుగుతామని పంజా విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు సభ దృష్టికి తెస్తే సభ్యులు తన గొంతు నొక్కేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వేదిక ముందు విజయ్ కుమార్ బైఠాయించిన అనంతరం వాకౌట్ చేశారు.

కేంద్రం ఎందుకు సహకరించడం లేదు: ఎమ్మెల్సీ యాదవరెడ్డి

ధాన్యం కొనుగోలు, మెడికల్ కళాశాల ఏర్పాటు విషయంలో కేంద్రం ఎందుకు సహకారం అందించడం లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రశ్నించారు. గతంలో 850 మెడికల్ సీట్లు ఉంటే నేడు 10 వేల సీట్లు ఉన్నాయన్నారు.జిల్లాకో నవోదయ కేంద్రం ఎందుకివ్వడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. మన ఊరు మన బడిలో 12 రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం, రెసిడెన్షియల్ విద్యార్థులపై ఒక్కొక్కరికి లక్షా 29 వేలు ఖర్చు చేస్తుందన్నారు. 2014 తర్వాత అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయో చూడాలన్నారు.ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు, కెసిఆర్ వచ్చాక సాధ్యమైందన్నారు. నేను కూడా డాక్టర్ నే 3 డయాలసిస్ సెంటర్ల నుండి నేడు 104కు పెరిగాయన్నారు. నేడు ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టేవారన్నారు. మెదక్, గజ్వెల్  రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినా కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కూలి దొరకని పరిస్థితి నుండి కూలీలు దొరకని పరిస్థితికి వచ్చిందన్నారు. ఎఫ్సిఐ ధాన్యం కొనుగోలు చేయకపోయినా కెసిఆర్ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. సమస్యలు చర్చించే వేదికపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

ప్రజా ప్రతినిధులు సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హితవు పలికారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. అయితే కొందరు సభ్యులు నెగెటివ్ గా మాట్లాడడం సరికాదని నిజాంపేట్ జెడ్పిటిసి విజయ్ కుమార్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎంపిపిలు, జెడ్పిటిసిలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.