కాలేశ్వరంపై రాహుల్ గాంధీవి అవగాహన రాహిత్య వ్యాఖ్యలు

కాలేశ్వరంపై రాహుల్ గాంధీవి అవగాహన రాహిత్య వ్యాఖ్యలు
  • కాలేశ్వరం కట్టిందే 80 వేల కోట్లతో
  • లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరమే కదా
  • మంత్రి హరీష్ రావు ధ్వజం

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం 80 వేల కోట్లతో నిర్మించి ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతుల సాగునీటి కష్టాలు తీర్చిందని రాష్ట్ర ఆర్థిక ,వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించడాన్ని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం నాడు సిద్దిపేటలోని కాటన్ మార్కెట్ యార్డులో నియోజకవర్గ రైతులకు స్ప్రింక్లర్లు డ్రిప్పు పరికరాలను పంపిణీ చేశారు. ఆయిల్ ఫామ్ రైతుల కు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చించింది 80 వేల కోట్ల అయినప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించడం ఆయన అవగాహనరాహిత్యానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నది. కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యమౌతదా అంటూ చెప్పుకొచ్చారు. 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 300 స్పింక్లర్లు సెట్లు ప్రభుత్వం పంచేదని, కానీ ఇవాళ స్వ రాష్ట్రంలో ఒక్కరోజు 1001 మందికి స్పింక్లర్లు పంపిణీ చేసుకుంటున్నామని, ఇప్పటికే సిద్ధిపేట జిల్లాలో రెండేళ్లలో 17 వేల స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని, చిన్నకోడూర్ మండలంలోనే 5100 స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. రైతులను చైతన్యం చేయాలని, బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమని జిల్లా వ్యాప్తంగా 17 వేల స్పింక్లర్లు సెట్లు పంపిణీ చేసేందుకు రూ.20 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం భరించిందని,ఇది రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ యేడు కాలమయ్యే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేశారని, రైతులకు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. 
గతంలో రైతులు ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారు కానీ. ఇప్పుడు సీఎం కేసీఆర్,కాళేశ్వరం పై నమ్మకంతో నారు పోస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులలో ఎంతో మార్పు వచ్చిందని,కాలంతో నిమిత్తం లేకుండా నీళ్లు అందిస్తున్నట్లు,యాసంగి పంట నూకలుగా మారి తుట్టి అవుతున్నా ఆ నష్టాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కే వారికి దండం పెట్టాలి. గత ప్రభుత్వాల హయాంలో దొంగరాత్రి కరెంటు వచ్చేదని,కానీ ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు.

రైతులు గుండెజారి పోవొద్దని,రైతుల కోసం చుక్క చుక్క ఒడిసి పట్టి కాళేశ్వరం జలాశయాలు నింపాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని,కాలం ఎత్తి పోయినా కాళేశ్వరం గేట్లు ఎత్తి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.కాళేశ్వరంతో యాసంగిలో 55 లక్షల ఎకరాలలో పంట పండించిన26 వేల కోట్లు రూపాయల ధాన్యం కొన్నాం. ఎక్కడా గుంట, ఎకరం ఎండలేదు.మూడేళ్లలో యుద్ధంలా పనిచేసి కాళేశ్వరం నిర్మించినట్లు వివరించారు.తొమ్మిదేళ్ల స్వరాష్ట్ర పాలనలో రైతులకు కరెంటుకు 60 వేల కోట్లు వెచ్చించినట్లు, 72 వేల కోట్లు రైతుబంధు కింద, రైతుభీమా కింద ఒక్కో రైతుకు లక్ష చొప్పున మొత్తం 5300 కోట్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు.

  • చేర్యాల ప్రాంత రైతులకు మంత్రి శుభవార్త 

చేర్యాల ప్రాంత రైతులకు మంత్రి శుభవార్త చెప్పారు. దేవాదుల నీళ్లు తెచ్చి తపాస్ పల్లి రిజర్వాయరు నింపుతామని, మల్లన్న సాగర్, రంగనాయక, కొండ పోచమ్మ, అంతగిరి, గౌరవెల్లి రిజర్వాయర్లు నింపి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో వర్షాధార పంటలుగా పత్తి, మొక్క జొన్న, జొన్న వంటి పంటలు మాత్రమే వేసేదని., కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకంతో ఇప్పటికీ నార్లు వేశారని పేర్కొన్నారు. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం వాడు నూకలు తినమని చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నూకల ఖర్చు భరించి అందరికీ బియ్యం అందిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో 7 గంటలు కూడా కరెంటు ఉండేది కాదనీ, కానీ ఇప్పుడు నిరంతరాయంగా వ్యవసాయ బావుల వద్ద కరెంటు ఉంటుందని చెప్పారు. కరెంట్ బిల్లుపోతే పోతుందని,ప్రతి ఒక్క రైతుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు.ఇంకా వానలు మొదలు కాకున్నాఅన్నీ గ్రామాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. జిల్లాలో 8 వేల 500 ఏకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లు, ఈ సంవత్సరం 1800 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నట్లు, ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్నదని, ఆయిల్ ఫామ్ లాభాల పంటగా ఎకరాకు 80 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు.పంట కాలాన్ని నెల ముందుకు తేవాలని, తప్పుడు వాన బాధ తప్పాలని రైతులకు అవగాహన కల్పిస్తూ.. వరి బదులుగా ప్రత్యామ్నాయ పంట మార్పిడి చేయాలని, పంట మార్పిడి విధానం వల్ల పంటలు బాగా పండుతాయని, వెదజల్లే పద్ధతిన వరి సాగు చేయాలని రైతులను కోరారు. ఈ సభలో ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా కమిటీ మెంబర్లకు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వైస్ ఛైర్మన్ సోమిరెడ్డి, జిల్లాలోని పలు మండలాల ఏంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునీత,అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.