నర్సంపేటకు ఉద్యాన హారం - హార్టికల్చర్

నర్సంపేటకు ఉద్యాన హారం - హార్టికల్చర్
  • రీసెర్చ్ సెంటర్ మంజూరు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • నల్లబెల్లి మండలం
  • కన్నారావుపేటలో ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఉద్యానవన రైతులకు శుభవార్త. నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పరిశోధన కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో మేలు జరగనుంది. ముఖ్యంగా మిర్చి పసుపు కూరగాయలు మామిడి జామ నిమ్మ అరటి అంగూర ఆయిల్ ఫామ్ లాంటి పంటల పరిశోధన సీడ్ తయారీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

అన్ని పంటల పరిశోధనకు అవకాశం..
నర్సంపేట నియోజకవర్గం నల్లవెల్లి మండలం కన్నారావుపేట లోని 58వ సర్వేనెంబర్ లో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వం నెలకొల్పబోతోంది. ఇంతకుముందు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, రైతుల భవితను దృష్టిలో పెట్టుకొని అన్ని పంటల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మొగ్గు చూపారు. నర్సంపేట నియోజకవర్గం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పండే అన్ని పంటలను ఇక్కడ పరిశోధన చేసే అవకాశం కలుగుతోంది. 

హార్టికల్చర్ యూనివర్సిటీకి అనుసంధానం..
గజ్వేల్ నియోజకవర్గం ములుగు లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి నర్సంపేటలో ఏర్పాటు చేయనున్న నూతన ఆర్టికల్ సెంటర్ ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా మిర్చితో పాటు పసుపు, కూరగాయలు, మామిడి, జామ, నిమ్మ, అరటి, అంగూర పండ్ల తోటలతో పాటు ఆయిల్ ఫామ్ లాంటి పంటలను పరిశోధించడం సీడ్ తయారీకి ఈ సెంటర్ వేదిక కాబోతోంది. పరిశోధన కేంద్రం ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో నియోజకవర్గానికి హార్టికల్చర్ కళాశాల మంజూరయ్యే అవకాశాలు చాలా వరకు మెరుగయ్యాయి. 

అశోక్ నగర్ టు కన్నారావుపేట..
హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ను ముందుగా ఖానాపురం మండలం అశోక్ నగర్ లో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, అక్కడ అటవీ స్థలం విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలం అయిన నల్లబెల్లి లోని కన్నారావుపేటకు రీసెర్చ్ సెంటర్ సెంటర్ తరలింది. ఉద్యానవనం పరిశోధన కేంద్రం మంజూరుకు సహకరించిన సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.