ఇస్రో మరో ముందడుగు

ఇస్రో మరో ముందడుగు
  • 26న భారీ రాకెట్ ప్రయోగం
  • 36 ఉపగ్రహాలు నింగిలోకి 
  • షార్ నుంచి రోదసీ కక్షలోకి
  • సన్నాహాలు చేస్తున్న శాస్త్రవేత్తలు

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. రోదసీ వాణిజ్యంలో మరో ముందడుగు వేస్తున్నది, ఇస్రో, షార్ శాస్త్రవేత్తలు 26న షార్ నుండి భారీ రాకెట్ ను ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ మార్క్​–3, ఎల్వీఎం–3, ఎం–3 మిషన్ ద్వారా యూకేకు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనునుంది ఇస్రో. ఇది పూర్తి వాణిజ్య రాకెట్ ప్రయోగం కనుక రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లయ్యింది. షార్ లోని రెండవ వాహక ప్రయోగ వేదిక మీద నుండి దీనిని ప్రయోగించనున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇస్రో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్​ఎస్​ఐఎల్​ రెండు దశలలో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి 1,000 కోట్ల రూపాయలకు పైగా ప్రయోగ రుసుముతో వన్​వెబ్​తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 36 వన్​వెబ్​ ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్‌ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.