ట్యాపింగ్​పై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం

 ట్యాపింగ్​పై గవర్నర్​కు ఫిర్యాదు చేస్తాం
  • కేసీఆర్ అనుమతి లేనిదే ఫోన్ ట్యాపింగ్ అసాధ్యం
  • కుక్కలు, నక్కలకు బీఆర్ఎస్  ఎందుకు సీట్లు ఇచ్చింది
  • సీఎం రేవంత్  కూడా ఫిరాయింపుల దారిలో వెళ్తున్నారు
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమతి లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యమని, ట్యాపింగ్​పై ఫిర్యాదు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రిటైర్డు ఐపీఎస్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఉద్దేశ పూర్వకంగా వారి హక్కులను భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన వివిధ ఎన్నికల సమయం లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని అన్నారు.  దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల పోన్ లు ట్యాప్ చేశారని ఆరోపించారు. 

ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి..

కేసీఆర్ నిజాం రాజు మాదిరిగా చట్టాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా, తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా వాడుకున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశ సమగ్రతను భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని, ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ ని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ బాధ్యత కూడా ఉందని, ఎన్నికల సమయం లో బీఆర్ఎస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించారని, ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఒక షాడో సీఎంగా వ్యవహరించి ఈ రోజు కేసు వస్తే నాకేం సంబంధం అంటున్నాడని వ్యాఖ్యానించారు. 

నక్కలను కుక్కలకు ఎందుకు సీట్లు ఇచ్చారు

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను మొదట ప్రొత్సాహించిందే బీఆర్ఎస్ అని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు మారే లీడర్లను కుక్కలు, నక్కలు అంటున్న కేసీఆర్.. నాడు ఆ కుక్కలు, నక్కలను ఎందుకు చేర్చుకుని ఎంపీ సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపుల దారిలో వెళ్తున్నాడని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకటే అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని ఆయన సవాల్ చేశారు.

హైదరాబాద్​లో 40 శాతం ఓటింగ్ దాటలేదు

హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదని అని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి ఓటర్లు దృష్టి సారించి పర్సంటేజ్ ను పెంచాలని ఆయన కోరారు. ఈ క్రమంలో అందరూ పోలింగ్​ లో పాల్గొనాలని తెలిపారు. ఈసారి దేశం, భవిష్యత్​ కోసం ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని, దీంతో మన భవిష్యత్త్ కూడా బాగుపడుతుందన్నారు. 2014కు ముందు 50 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది కానీ ఆ తర్వాత మోడీ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకోచ్చారో చూడాలని పేర్కొన్నారు. అవినీతిరహిత పరిపాలన అందించిన మోడీ ప్రభుత్వ లక్ష్యమని, దేశ భద్రతను, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదో ఆర్థిక అతి పెద్ద దేశంగా భారత్ ను తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. యూకే లాంటి దేశాలను కూడా వెనక్కి నెట్టేసి ఐదో స్థానంలోకి రావడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతోనే ఆర్థికంగా బలపడ్డామన్నారు. డిజిటల్​ ట్రాన్సెక్షన్స్​ చాలావరకూ పెరిగాయని వెల్లడించారు.