గోవర్ధనగిరిధారియైన లక్ష్మీనరసింహుడు

గోవర్ధనగిరిధారియైన లక్ష్మీనరసింహుడు

ముద్ర ప్రతినిధి భువనగిరి:యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహుడు గోవర్ధనగిరిధారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. 
బ్రహ్మోత్సవములలో శనివారం  ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామి వారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవముగా ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగించారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి  ఎమ్.రామకృష్ణారావు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.


గోవర్ధనగిరిధారి అలంకార శేవ ప్రత్యేకత
బృందావనంలో నిర్వహించిన గోపూజ ఉత్సవమును సహించలేని ఇంద్రుడు ఉత్సవమును భంగపరచి అల్లకల్లోలం కలిగించుటకై కుంభద్రోణ వర్షములను కురిపించసాగెను. గోగోప బృందమంతా శ్రీకృష్ణుని వద్దకు చేరి పరమాత్మను ప్రార్ధించగా ఇంద్రునికి గుణపాఠం చెప్పి గర్వాన్ని తొలగించదలచి చిటికెన వ్రేలితో గోవర్ధన పర్వతమును పైకి ఎత్తి గోవులను గోపబాలులను అందరినీ ఆపర్వతము క్రిందికి రప్పించి సంరక్షించిన తీరు గోవర్ధనగిరిధారిలోని విశేషము.


గో శబ్ధమునకు వేదములు, జీవులు, ప్రాణికోటి చరాచరాత్మక సమస్తము, గిరి అనే శబ్ధమునకు దేహములు, పర్వతములని అనేక సంపదలని వాటిని ధారి ధరించువాడు అని గోవర్ధనగిరిధారిలోని వేదాంతపరమైన అర్థవిశేషం. భగవానుడి శరణువేడిన మన రక్షణ భారము తానే స్వీకరించునని సర్వజగద్రక్షకుడైన పరమాత్మ ఆశ్రయణీయమే జీవులకర్తవ్యమని ఎంత మహోన్నతస్థితి ఉన్నను. అహంకారాదులు కలిగిన పతనము తప్పదని తెలియపరచిన అపూర్వతత్త్వమే ఈ గోవర్ధనగిరిధారిలోని తత్త్వము. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకారములో దర్శించిన సకల శుభములు కలుగునని ప్రశస్తి.


సాయంకాల కార్యక్రమములు శనివారం సాయంకాలం 
 శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామి వారిని సింహవాహన శేవలో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవముగా ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలలో ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


సింహ వాహన శేవ ప్రత్యేకత
బ్రహ్మోత్సవములలో నేడు శ్రీ స్వామి వారు సింహవాహనారూఢుడై భక్తులకు దర్శన భాగ్యము కలిగించును. సింహము శౌర్యానికి, పరాక్రమానికి ప్రత్యేకతగా నిలచిన స్వరూపమే గాక జ్ఞానప్రదాయకమైన తత్త్వముగా ఉపనిషత్తులు పేర్కొనుచున్నవి. సగంనరుడిగా సగం సింహంగా ఆవిర్భవించిన శ్రీ స్వామి వారు సింహవాహనారూఢుడై తిరువీధులలో ఊరేగింపుగా విచ్చేయుట ఎంతో మనోహరమై యున్నది. ఈ క్షేత్రములో నరసింహ స్వామి వారు పంచరూపములలో భక్తకోటిని అనుగ్రహించుచూ సర్వాలంకార శోభితులై బ్రహ్మాది దేవతలచే ఆరాధింపబడుచూ ఉత్సవములు స్వీకరించుచూ భక్తులకు దర్శనభాగ్యం కలిగించుట ఉత్సవ ప్రత్యేకత తెలియజేయుచున్నది.

సాంస్కృతిక కార్యక్రమాలు..
 శనివారం ఉదయం హైద్రాబాద్ కు చెందిన శ్రీ సాయిశ్రీనివాస భజన మండలి వారిచే భజన కార్యక్రమం, రాయగిరి  శ్రీరామభక్తజన మండలి వారిచే  భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ బూడిద సత్తయ్య బృందం వారిచే భజన కార్యక్రమం  వింజమూరి విజయకుమారా చార్యులు చే నృసింహ తత్త్వమును గురించి ఉపన్యాసమిచ్ఛారు. శ్రీ పాల రామాంజనేయ భాగవతార్ చే సీతాకళ్యాణం అను హరికథాగానం వినిపించారు. సాయంకాలం మహతి ఆర్ట్స్ వారిచే భక్తిసంగీతము, భ్రమరాంభ వరంగల్ వారిచే కూచిపూడి నృత్యం, కుమారి నాగదుర్గ చే కూచిపూడి నృత్య ప్రదర్శన,  శ్రీ సురభి అకాడమి ఆఫ్ ఫర్ ఫార్మింగ్ వారిచే కూచిపూడి నృత్యం,  కుమారి అంకం శిరీష చే కూచిపూడి నృత్యం చేశారు. లాస్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్ వారిచే నృత్యం, నృత్యదీక్షాలయ, మల్కాజ్గరి వారిచే కూచిపూడి నృత్యం  ఆరుట్ల లక్ష్మీసౌజన్య,  హరిత,అనన్యలు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.