పట్టాలెక్కిన బిఆర్ఎస్ పట్టుబిగిస్తున్న కాంగ్రెస్.. మంథని నియోజక వర్గం ముఖచిత్రం 

పట్టాలెక్కిన బిఆర్ఎస్ పట్టుబిగిస్తున్న కాంగ్రెస్.. మంథని నియోజక వర్గం ముఖచిత్రం 

మహాదేవపూర్, ముద్ర: మంథని నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రతో బిఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. గ్రామాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరగటంతో పార్టీలో ఉత్సాహం కనిపిస్తున్నది. బిఆర్ఎస్ టికెట్  పుట్ట మధుకు ప్రకటించిన వెంటనే యాత్రకు శ్రీకారం చుట్టాడు. మంథని నియోజకవర్గంలోని 10 మండలాలను చుట్టి వచ్చిన పుట్ట మధు రక్షణాత్మక వైఖరి నుండి బయటపడగలిగాడు.గతంలో టికెట్ పై అనుమానాలు నెలకొనడంతో పార్టీ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. తిరిగి ప్రజా ఆశీర్వాద యాత్రతో బిఆర్ఎస్ పార్టీ పట్టాలెక్కింది. శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు నుండి తిరుగులేని శక్తిగా ఉంది. అనేకులు కాంగ్రెసులో చేరడానికి పరుగులు పెట్టే తరుణంలో పుట్ట మధుకు టికెట్ ప్రకటించడంతో ఊపు తగ్గింది. శ్రీధర్ బాబు తన పట్టును తిరిగి బిగించెందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వ్యక్తిత్వం చాలా ఉన్నతమైన దని, ప్రజలకు కావలసిన పనులను నిజాయితీగా చేస్తాడని, అవినీతి మచ్చ ఆయనపై పడలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. సోషల్ మీడియా, రకరకాల పద్ధతుల ద్వారా పుట్ట మధు ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నట్లు పుట్ట మధు ఆరోపిస్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజలను పట్టించుకోలేదని, సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయలేదని ప్రతిపక్షంలో ఉన్నామంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని పుట్ట మధు ఆరోపిస్తున్నారు.

బిఆర్ఎస్ పథకాలలోని డొల్లతనాన్ని కాంగ్రెస్ నాయకులు బట్టబయలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా పసుపు కుంకుమ పథకంను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు రాష్ట్రం ముందుకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందలాది కోట్లు పుట్టమధు ఆర్జించినట్లుగా చేస్తున్న ప్రచారానికి ధీటుగా కర్ణాటక నుండి వందల కోట్లను శ్రీధర్ బాబు కుమ్మరించనున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుల భూసేకరణలో రైతులకు రిజిస్ట్రేషన్ విలువను పెంచి పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరేలా ప్రయత్నించామే తప్ప ఏ ఒక్కరి భూమిపై తాము అవినీతికి పాల్పడలేదని పుట్ట మధుచాలెంజ్ చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో మంథని నియోజక వర్గానికి చుక్క నీరు రాకుండా చేయడంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పెండింగ్లో పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అనుమతి లేకుండానే ప్రారంభించి ప్రాజెక్టుపనులలో కమిషన్లు దండుకున్నారని టిఆర్ఎస్ నేతలు ప్రతిగా విమర్శిస్తున్నారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్టుకు తాను అటవీ శాఖ అనుమతి తెప్పించడంతోపాటు పడిఉన్న పైపులతో పైపులైన్ వేయించిన ఘనత తనకే దక్కుతుందని అంటున్నారు.

దీర్ఘకాలంలో ప్రాజెక్టులో పెద్ద ఎత్తున లాభం జరగనున్నదని టూరిజం, ఉపాధి పెరుగుతుందని ప్రజలకు పుట్ట మధు సర్ది చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నియోజకవర్గ ప్రజల కోసం పుట్ట మధు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపిస్తున్నారు. శ్రీధర్ బాబు ఎలాంటి ఆర్భాటం లేకుండా తన పని తను చేసుకుంటూ పోతుండగా, మౌనం వహిస్తున్న శ్రీధర్ బాబు వ్యూహం ఎలా ఉంటుందోనని ప్రజలతోపాటు, బిఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. మంథని నియోజకవర్గంలో సేవ చేయడంలో ముందు వరసలో పుట్ట మధు నిలిచాడు. శ్రీధర్ బాబు విద్యార్థులకు, రోగగ్రస్తులకు చేస్తున్న సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నారు. పుట్ట మధు ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో అనేకమంది శ్రీధర్ బాబు అనుచరులు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా. శ్రీధర్ బాబు వెన్నంటి ఉన్న తన కార్యకర్తలతో ఎన్నికలలో తలపడనున్నారు. శ్రీధర్ బాబుకు పట్టున్న మహాదేవపురం, మహాముత్తారం, కాటారం, మలహర్, పలిమెల మండలాలపై పుట్ట మధు ప్రత్యేక దృష్టి సారించగా, మిగతా ఐదు మండలాలపై శ్రీధర్ బాబు దృష్టి సారించారు. దీంతో ప్రస్తుతం బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. 

 బేరీజు వేస్తున్న ప్రజలు

అటు కేసిఆర్ పథకాలు, బహుజనవాదం, పుట్ట లింగమ్మ ట్రస్టు సేవలతో పుట్ట మధు ప్రచారం సాగిస్తుండగా, ఇటు అపార అనుభవం, టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. రెండు పార్టీలను, అభ్యర్థులను బేరీజు వేసుకుంటున్న ప్రజలు సందిగ్ధంలో పడిపోయారు. మంథని నియోజకవర్గంపై రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంథని నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా గత దశాబ్దమున్నర కాలంగా రాజకీయాలలో ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి వివాద రహిత రాజకీయాలకు పెట్టింది పేరు. పలు మండల కేంద్రాలలో గ్రామాలలో బిజెపికి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు లేరు. టిఆర్ఎస్ లో ముందు నుండి నాయకత్వం వహించిన వ్యక్తిగా సునీల్ రెడ్డి పై సానుభూతి ఉంది. నియోజకవర్గం అంతా పర్యటిస్తూ పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలను సమీకరించుకునే పనిలో పడ్డారు. సునీల్ రెడ్డికి వచ్చే ఓట్లు కూడా మంథని ఎన్నికలను ప్రభావితం చేసే వీలుంది. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న సునీల్ రెడ్డి ప్రచారంలో ప్రధాన పార్టీలకు దీటుగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున శక్తి, యుక్తులు ప్రదర్శించనున్నారు. రాబోయే ఎన్నికల రణరంగంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.