కొత్త రోడ్లకు రూ.50 కోట్లు మంజూరు..

కొత్త రోడ్లకు రూ.50 కోట్లు మంజూరు..
  • అంచెలంచెలుగా నియోజకవర్గ అభివృద్ధి..
  • తొందరలో వరద బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం..
  • విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:నియోజకవర్గంలో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. ఇటీవలె కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో భారీగా నష్టం వాటిల్లిందని ఈ విషయం మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వరదల వల్ల ఇటీవల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి తొందర్లోనే సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో నూతనంగా ఏడు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజల పాలనాసౌలభ్యం ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ విడతల వారిగా చేయడం చాలా గొప్ప విశేషంగా చెప్పారు. రైతు రుణమాఫీ నిర్ణయం వలన జిల్లాలో దాదాపు 60601మంది రైతులకు రూ.360.28కోట్ల లబ్ది చేకూరుతున్నట్లు వివరించారు.

నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట, జడలపేట, జగ్గయ్యపేట ,సుల్తాన్ పూర్ గ్రామాలలో సైడు కాలువల నిర్మాణం కోసం రూ.2కోట్ల మంజూరయ్యాయని, కనిపర్తి, కాశింపల్లి, మెట్ పల్లి, అప్పయ్యపల్లి తదితర గ్రామాల శివారు చలివాగులపై నూతన చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరయ్యాయని, జిల్లాలో నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజ్ కి అదనంగా రూ.110కోట్లు అదనపు గదులు, ఆశ్రమ భవనాల నిర్మాణాల కోసం మంజూరైనట్లు తెలిపారు. ఈరోజు నుండి మార్ మారుమూల గ్రామాల్లో మన ఊరు మన రమణ అన్న కార్యక్రమం పేరుతో పల్లెనిద్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, నాయకులు కటకం జనార్ధన్, కళ్లెపు రఘుపతిరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.