అన్నారం ఇసుక క్వారీ నిలిపివేత

అన్నారం ఇసుక క్వారీ నిలిపివేత

‘ముద్ర’ కథనంతో కదలిక

మహాదేవపూర్, ముద్ర: హఠాత్తుగా అన్నారం క్వారీని నిర్వాహకులు నిలిపి వేశారు. కాంట్రాక్టర్ అధికారులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డట్టుగా తెలుస్తుంది. లారీలలో లోడైన ఇసుకను సమానంగా నేర్పేందుకు స్థానికంగా ఉన్న కూలీలను వాడుకుంటారు. ఉదయం పూట పనిలోకి వెళ్లిన కూలీలను క్వారీ నిర్వాహకులు తిప్పి పంపించారు. ఆన్లైన్లో వాహనాలు బుక్ అయినప్పటికీ వాటిని నింపకుండా వదిలేశారు. ఒకే రీచ్ పై అన్నారం బ్యారేజ్ మత్తడి క్రింది భాగంలో ఏకంగా రెండుక్వారీలను నిర్వహిస్తున్నారు. ఒకటి కమర్షియల్ క్వారీ కాగా మరొకటి డబల్ బెడ్ రూమ్ ల కోసం నిర్వహిస్తున్న క్వారీ డబల్ బెడ్రూం క్వారీకి రవాణా చేయబడే ఇసుకను ఒడ్డుపై డంపు చేయకుండా నేరుగా గోదావరిలో నుండి యదేచ్చగా తరలిస్తున్నారని తెలిసింది. దీనికి ఎలాంటి లెక్క పత్రాలు ఉండకుండా చేసుకుంటున్నారు. అన్నారం బ్యారేజ్ కిందనుండి డబల్ బెడ్ రూమ్ క్వారీని  నిర్వహిస్తూనే కమర్షియల్ క్వారీకి కావలసిన ఇసుకను కూడా ఇక్కడి నుండే తోడుకుంటూ రవాణా చేస్తున్నారు. ప్రతి క్వారీకి గోదావరిలో హద్దులు నిర్మించి రోడ్లు వేసి తరలించాల్సి ఉంటుంది.

జిల్లా మైనింగ్ అధికారి వీరికి హద్దులు నిర్ణయించారా లేదా? కాంట్రాక్టర్  ఇష్టాఇష్టాలపై వదిలేశారా? అనేది అర్థం కాని ప్రశ్న. కోట్ల రూపాయల ఇసుక వ్యవహారంలో కాంట్రాక్టర్ మాత్రమే సర్వాధికారిగా  వ్యవహరిస్తారని జనంలోని మాట. అటు బ్యారేజీకి నష్టం వాటిల్లుతుందా? గోదావరిలో ఇసుక మేటలు ఎంత మందంతో ఉన్నాయి? ఎంత పరిమాణంలోఇసుక ఉంది, అనే శాస్త్రీయ అంశాలను పట్టించుకునే వారే లేరు. ఇసుకను తోడడము డంపు చేయడము హైదరాబాద్ మార్కెట్లోకి వదలడం ఒక్కటే వీరికి తెలుసు. ఈ క్వారీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. టిఎస్ఎండిసి అధికారులు అక్రమాలకు అడ్డంకులు కలగకుండా చూడడమే తమ ఉద్యోగ ధర్మంగా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

అన్నారం క్వారీ వివరాల కోసం టిఎస్ఎండిసి ప్రాజెక్ట్ అధికారిని చరవాణి ద్వారా సంప్రదించగా తన పరిధిలో రెండు జిల్లాల క్వారీలు ఉన్నాయని, ఫీల్డ్ పై ఉన్నందున తాను ఎప్పుడు వచ్చేది తెలియదని అన్య మనస్కంగా బదులిచ్చారు,  వివరాలకు హైదరాబాదులోని టిఎస్ఎండిసి ఎండిని సంప్రదించాలని అసహనంగా సెలవిచ్చారు. అన్నారం క్వారీలోని అక్రమాల గురించి ‘ముద్ర’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి క్వారీని మూసి ఉంచినట్లు తెలిసింది. కోటానుకోట్ల రూపాయలను ఈ క్వారీ ద్వారా దండుకోవటంతో పాటు అన్నారం బ్యారేజీ లీకేజీకి కారణమైన ఈ క్వారీ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.