మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేపట్టారహో!

మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేపట్టారహో!

మహాదేవపూర్, ముద్ర: చడీ చప్పుడు కాకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇంజనీరింగ్ అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులోని 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఎల్&టి నిర్మాణ సంస్థ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరమ్మతుల బాధ్యత తమదేనని తెలిపింది. ఎన్నికల అనంతరం తమ కాంట్రాక్టు గడువు ముగిసినందున తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలు సిట్టింగ్ జడ్జితో బ్యారేజీ నిర్మాణ పనులను విచారించాలని పూనుకున్నారు. ఎల్&టి సంస్థ విరుద్ధ ప్రకటనలు గందరగోళపరిచాయి.

ప్రభుత్వ పెద్దలు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ మేడిగడ్డ వద్ద ఇంజనీరింగ్ అధికారులు పనులను ప్రారంభించారు. ఈ పనులను ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు చేపట్టారా  లేక ఎల్ & టి సంస్థ చేపట్టిందా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేపట్టాలంటే కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉంటుంది. ఇది డ్యాం వద్ద ఇసుకలో నుండి ఊటలను, నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిరోధిస్తుంది.

అనంతరం మాత్రమే సాంకేతిక విశ్లేషణ, మరమ్మతులు చేపట్టడానికి వీలవుతుంది. కాపర్ డ్యాం నిర్మాణానికి 500 కోట్లు ఖర్చుకానునట్లు ఎల్& టి సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతము కాఫర్ డాం నిర్మిస్తున్నారా లేక ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక విశ్లేషణతో అంచనాలను తయారు చేస్తున్నారా అనేది ఉన్నతాధికారులు వెల్లడిస్తే తప్ప తెలియదు. మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇంజనీరింగ్ అధికారులు పనులను మాత్రం ముమ్మరం చేయడం ఆసక్తిని రేపుతున్నది.