కేటీపీపీ లో విలువైన సామాగ్రి మాయం..?

కేటీపీపీ లో విలువైన సామాగ్రి మాయం..?
  • ఇంటి దొంగల పనేనా..
  • అంతర్గతంగా విచారణ.. 
  • పోలీసులకు ఫిర్యాదు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో  దొంగలు పడ్డారు. సుమారు రూ. కోటి విలువైన సామాగ్రి మాయమైనట్లు తెలిసింది.  వివరాల్లోకి వెళితే.. కేటీపీపీ లోని స్టోర్ రూంలో నిల్వ ఉన్న కాపర్ వైరు భారీగా మాయం అయినట్లు తెలిసింది. స్టోర్ రూంలో  కాపర్ వైరుతో పాటు విలువైన సామాగ్రి కనిపించడం లేదని  సిబ్బంది గుర్తించారు. ఈ విషయం జెన్ కో ఉన్నతాధికారులకు తెలియడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.  విషయం బయటికి పోక్కకుండా.. జెన్ కో అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విలువైన సామాగ్రి మాయం కావడం ఏంటి.. అంత సెక్యూరిటీ ఉన్న కేటీపీపీ లో సామాగ్రి ఎలా మాయమైందనే విషయంపై కూపీ లాగుతున్నారు. ఇంతలో ఈ విషయం జెన్ కో సీఎండీ కి తెలియడంతో  స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అంతర్గత విచారణలో ఫలితం లేకపోవడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇంటిదొంగల పనేనా..?

కేటీపీపీ లో విలువైన సామాగ్రి మాయం కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇంటి దొంగల పనేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జెన్ కో పగడ్భందీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ విలువైన సామాగ్రి మాయం కావడం అధికారులకు తలనొప్పిగా మారింది. బయటి నుండి దొంగలు వచ్చే అవకాశం లేకపోగా రాత్రి షిప్టులో పని చేసే స్థానిక సిబ్బందే ఈ పని చేసి ఉంటారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే అధికారుల్లో ఈ వ్యవహారం వణుకు పుట్టించినట్లయింది. ఈ విషయం సీఎండి వరకు వెళ్లడం, పెద్ద మొత్తంలో సామాగ్రి మాయం కావడం పట్ల ఎవరిపై వేటు పడుతుందోననే ఉత్కంఠ కేటీపీపీ లో నెలకొంది. 

జెన్ కో లో అసలు ఏం జరుగుతుంది..

చెల్పూరు లోని జెన్ కో లో అసలు ఏం జరుగుతుందోననే సందేహాలు జిల్లా వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. వెలుగులు విరజిమ్మే కేటీపీపీ లో అధికారులు ఆడిందే ఆటలా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాను  లోపలికి అనుమతించకుండా, ఏం జరిగినా లోలోపల కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జెన్ కో లో ఏం జరిగినా అధికారులు చెప్పిందే వినాల్సిన పరిస్థితులు దాపురించాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

సిబ్బంది నియామకంలోనూ అవకతవకలు..

జెన్ కో పని చేసే సిబ్బంది నియామకంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైరవీకారుల వద్ద ముడుపులు తీసుకుని కనీసం పదో తరగతి కూడా లేని వాళ్లను నియామకం చేశారని, అర్హులకు మొండిచేయి చూపించారనే విమర్శలు వెలువడుతున్నాయి.