శభాష్ మేడిపల్లి సత్యం

శభాష్ మేడిపల్లి సత్యం

స్ఫూర్తివంతమైన నిర్ణయానికి ప్రశంసలు

మొదటి నెల జీతం పేద విద్యార్థులకు విరాళం

కలెక్టర్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విలక్షణ ఆలోచనతో స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం పూట నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులలో అల్పాహారం అందించడమే లక్ష్యంగా తను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి నెల జీతం లక్ష 50 వేల రూపాయలను విరాళం గా అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి చెక్కును అందించి తన ఉదారతను చాటుకున్నారు. మేడిపల్లి సత్యం తీసుకున్న నిర్ణయం పై విద్యావంతులు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తాను బాల్యంలో చదువు కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. అలాంటి సమస్యలు ఏ ఒక్క విద్యార్థికి దరి చేరకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారని, చదువు కొనే సమయంలో వారికి ఆకలి బాధ ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, అడిషినల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.