కేసులతో విరుచుకుపడుతున్న మైనింగ్ శాఖ

కేసులతో విరుచుకుపడుతున్న మైనింగ్ శాఖ
  •  ఫిబ్రవరిలో  జరిమానా రూపంలో 20 లక్షల రూపాయల వసూలు
  •  ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్
  •  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  గ్రానైట్ వ్యాపారులు 

 ముద్ర ప్రతినిధి కరీంనగర్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలు గ్రానైట్ కంపెనీలు, అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై భూగర్భ ఘనుల  శాఖ కేసులతో విరుచుకుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ కీలక ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఒక్క ఫిబ్రవరి నెలలోనే 57 కేసులు నమోదు చేసింది. దీంతో గ్రానైట్ వ్యాపారులు, అక్రమ రవాణా చేస్తున్న వాహన దారులు బెంబేలెత్తిపోతున్నారు. మైనింగ్ శాఖ కరీంనగర్ జిల్లాలో  ఫిబ్రవరి నెలలోనే 20లక్షల 26వేల 393 రూపాయలు ఫెనాల్టీ రూపంలో వసూలు చేసింది. ఇది ఆల్ టైం రికార్డు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం వివిధ రూపాల్లో 70 శాతం మాత్రమే భూగర్భ గనుల శాఖకు ఆదాయం సమకూరింది. మార్చి 31 నాటికి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. ఫిబ్రవరి నెలలో స్టోన్ క్రషు్కు సంబంధించి 11 యూనిట్ల నుంచి 6,61,781 రూపాయలు, కలర్ గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి 12 యూనిట్ల నుంచి 10,07,267 రూపాయలు, సామర్థ్యానికి మంచి గ్రావెల్ సరఫరా చేస్తున్న 8 వానాలకు జరిమానా ద్వారా 66,400 రూపాయలు, రెండు కలర్ గ్రానైట్ వాహనాలకు జరిమాన విధించడం ద్వారా 1,70,205 రూపాయలు, 24 ఇసుక ట్రాక్టర్ల నుంచి జరిమానా ద్వారా 1,80, 740 రూపాయలు, మొత్తంగా 20,26,393 రూపాయలు వసూలు చేశారు. అయితే ఇప్పటి వరకు 70 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించారు, మార్చి నెలలో మరింత తనిఖీలు, జరిమానాలు పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారి పనుల్లో ఉపయోగించే మట్టి వినియోగం ద్వారా 20శాతం, కంకర వాడకంలో సైజును బట్టి సీనరేజి నిధులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ రహదారి పనులకు సీనరేజీ  చెల్లించకుండా పనులు చేపట్టడంతో   మైనింగ్ శాఖ  భారీగా పెనాల్టీ విధించింది.

కరీంనగర్ జిల్లాలో తోపాటు చుట్టుపక్కల 297 గ్రానైట్ లీజులు ఉండగా వీటి పరిధిలో 977 హెక్టార్లలో గ్రానైట్ ను వెలికితీస్తున్నారు. ఈ క్వారీల నుంచి నెలకు 100 నుంచి 150 కోట్ల రూపాయల విలువ చేసే 50 వేల నుంచి 70 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను వెలికితీసి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్రానైట్లో సుమారు 50 వేల క్యూబిక్ మీటర్లు విదేశాలకు
ఎగుమతి అవుతుండగా, 20 వేల క్యూబిక్ మీటర్ల మేరకు స్థానికంగా ఉన్న 350 గ్రానైట్ ఫ్యాక్టరీలు (పాలిషింగ్ యూనిట్లు) వినియోగిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ ముఖ్యంగా చైనా మార్కెట్ దెబ్బతినండంతో గ్రానైట్ వ్యాపారం దెబ్బతింది. ప్రస్తుతం 50 వేల క్యూబిక్ మీటర్లు కూడ రవాణా కాని పరిస్థితి నెలకొంది. క్యూబిక్ మీటర్ గ్రానైట్ రాయికి ఎక్స్ పోర్ట్ చేసినందుకుగాను 2,700 రూపాయల సీనరేజి చార్జి ప్రభుత్వానికి లభిస్తున్నది. జిల్లాలో ఉత్పత్తి ఎగుమతి అయ్యే 50 వేల క్యూబిక్ మీటర్లకుగాను నెల నెలా 13.5 కోట్ల రూపాయల చొప్పున ఏటా 162 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్నది.

మైనింగ్ శాఖ పై గ్రానైట్  వ్యాపారుల ఆగ్రహం

 మైనింగ్ శాఖ పెనాల్టీల రూపంలో విరుచుకు పడడంతో గ్రానైట్ వ్యాపారులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా వ్యాపారులకు వంత పాడుతూ తక్కువ పెనాల్టీ విధిస్తూ, జీవనోపాధి కోసం చిన్న చిన్న ఫ్యాక్టరీలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న కంపెనీలపై ఎక్కువ పెనాల్టీ విధిస్తున్నారని   ఆరోపిస్తున్నారు. ఆ శాఖ ఉన్నత అధికారులతో పాటు సంబంధిత శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అసలే ఎగుమతులు లేకుండా కుంగిపోతున్న గ్రానైట్ వ్యాపారంపై అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట కేసుల నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇలా చేయడంతో గ్రానైట్ వ్యాపారంతో పాటు కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.