మేడారం జాతరను విజయవంతం చేయాలి..

మేడారం జాతరను విజయవంతం చేయాలి..
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దు.. 
  • జాతర అభివృద్ధికి రూ.75 కోట్లు కేటాయింపు..
  • పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క..
  • జాతరలో మొక్కులు చెల్లించి, అభివృద్ధి పనుల పరిశీలన..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి (ములుగు):మేడారం మహా జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కోరారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను సోమవారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు.

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సమీపిస్తుండడంతో జాతర సమీప ప్రాంతాలు గల పస్రా లోని గుండ్లవాగు బ్రిడ్జి, దయ్యలవాగు సమీపంలో ఉన్న  రోడ్డు, చింతల్ క్రాస్ వద్ద రోడ్డు, పార్కింగ్ స్థలాలు, ఉరట్టం బ్రిడ్జి, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. చిలుకలగుట్ట, విఐపి పార్కింగ్, బస్ స్టాండ్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, డిఎస్పీ రవీందర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.