శతాబ్దాల కల సాకారమైంది

శతాబ్దాల కల సాకారమైంది
  • రాముడు వివాదం కాదు.. పరిష్కారం
  • జనవరి 22.. క్యాలెండర్​లో తేదీ కాదు.. నవశకానికి నాంది
  • ఇకపై రామయ్య  టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు
  • ఆయన పాఠాలే దేశానికి చట్టాలు
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
  • బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భావోద్వేగ ప్రసంగం

అయోధ్య : ‘‘శ్రీరాముడు.. వివాదం కాదు.. పరిష్కారం. రాముడు అగ్ని కాదు శక్తి. ఆయన వర్తమానం కాదు శాశ్వతుడు. బానిసత్వ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేసి, గతం నుంచి ధైర్యసాహసాలు తీసుకుంటూ ఎదిగిన దేశం ఇలాంటి కొత్త చరిత్రను సృష్టిస్తుంది’’ అని ప్రధానమంత్రి మోడీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తరవాత ప్రధాని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. శ్రీరామ చంద్రమూర్తికీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.

శతాబ్దాలుగా ఎదురు చూశాం..

అయోధ్యలో రామ మందిరం నిర్మానం కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు తమ కల సాకారమైందన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. జనవరి 22 అనేది కేవలం క్యాలెండర్‌లో ఓ తేదీ కాదని.. నవశకానికి ప్రారంభం అని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ తనకు అలౌకిక ఆనందాన్నిస్తోందని అన్నారు.  రామ భక్తులందరికీ ప్రణామాలు చేశారు. ఎన్నో శతాబ్దాలుగా రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయని, ఇన్నాళ్లకు అవన్నీ తొలగిపోయాయని అన్నారు. రాముడికి మందిరం నిర్మించాలనుకునే సంకల్పంలో ఎక్కడో లోపం ఉండి ఉండొచ్చని.. అందుకే ఇంత ఆలస్యమైందని చెప్పారు.

మన అయోధ్యకు రాముడొచ్చాడు..

‘‘ఇవాళ దేశమంతా అలౌకిక ఆనందంలో మునిగిపోయింది. ఇన్నేళ్ల నిరీక్షణ తరవాత మన అయోధ్యకు రాముడు వచ్చేశాడు. ఇకపై మన రామయ్య టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కోసం ఇవాళ భారీ మందిరం నిర్మించాం. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఈ రోజు క్యాలెండర్‌లో కేవలం ఓ తేదీ కాదు. ఇది నవశకానికి ప్రారంభం. రామ భక్తులందరికీ ప్రణామాలు’’ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమయంలో రాముడి గొప్పదనాన్ని ప్రస్తావించారు ప్రధాని మోడీ. రాముడే ఈ దేశ విశ్వాసం అని.. ఆయన పాఠాలే దేశానికి చట్టంగా మారిందని వెల్లడించారు. ఈ దేశ గర్వం, గౌరవం అన్నీ రాముడే అంటూ కీర్తించారు. అలాంటి రాముడికి తగ్గ స్థానం ఇస్తే ఆ ప్రభావం మన దేశంపై వేల ఏళ్లపాటు నిలిచి ఉంటుందని చెప్పారు.  ‘‘ఈ రామ మందిరం జాతిని మొత్తం మేల్కొల్పుతుంది. భారత దేశ విశ్వాసం, పునాది, గర్వం, గౌరవం..అన్నీ శ్రీరామ చంద్రుడే. మన భరత జాతి కీర్తి వెలుగొందింది ఆయన వల్లే. ఆయన చెప్పిందే మన దేశం అనుసరిస్తున్న చట్టం. ఆయనకు తగిన గౌరవం ఇస్తే ఆ కటాక్షం, ప్రభావం మన దేశంపై శతాబ్దాలు మాత్రమే కాదు..వేలాది సంవత్సరాలు ఉంటుంది” అని మోడీ అభివర్ణించారు.