మోదీ ప్రారంభించేది వ్యాగన్ ఫ్యాక్టరీనా....వాషింగ్ ఫ్యాక్టరీనా....?

మోదీ ప్రారంభించేది వ్యాగన్ ఫ్యాక్టరీనా....వాషింగ్ ఫ్యాక్టరీనా....?
  • మేగా టెక్స్ టైల్ పార్కుకు ఓనర్లు ఎవరు....?
  • ఎవరి స్వలాభం కొరకు ఎన్.హెచ్ 563 అలైన్మెంట్ మార్పు జరుగుతుంది
  • బి.జె.పి, బి.ఆర్.ఎస్ రెండు ఒక్కటే
  • ఫెడరల్ సిస్టం గౌరవాన్ని దెబ్బతీసి కొత్త బిచ్చగాళ్ల వలే వ్యవహరించడం రెండు పార్టీలకు సిగ్గుచేటు
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ముద్ర, వేములవాడ:-వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభించేది రైల్వే కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీనా లేక రైళ్లలో చెత్తను తీసేసి కడిగే వాషింగ్ ఫ్యాక్టరీనా అని, దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశాడు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న 'యువ పోరాట యాత్ర' ను పురస్కరించుకుని శుక్రవారం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ లతో కలిసి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం గుప్పించారు. సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఏది ప్రారంభిస్తున్నామో ప్రజలకు తెలియజేప్పకుండానే ఎంతో గొప్ప పని చేస్తున్నట్లు బీజేపీ నాయకులు  ప్రచారం చేసుకుంటున్నారని, ఇంతకీ అక్కడ మోడీ ప్రారంభించేది  వ్యాగన్ ఫ్యాక్టరీనా..వాషింగ్ ఫ్యాక్టరీనా అంటూ ఎద్దేవా చేశాడు. భద్రత కారణాల దృష్ట్యా అంటూ మెగా టెక్స్ట్ టైల్ పార్కు నిర్మాణానికి ఆర్ట్స్ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేస్తున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారాని, మరి 2017 అక్టోబర్ నెలలో  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్కు ఏమైందని,  దేశ వ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేస్తున్న 8 మెగా టెక్స్ట్ టైల్ పార్కులలో ఇది ఒకటా లేక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కుకే మళ్ళీ బొట్టు పెట్టి ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారా అని,  దీనికి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాధానం చెప్పాలని ఆధారాలను చూపించుకుంటూ డిమాండ్ చేశాడు.

ఒకవేళ రాష్ట్రంలో నిజంగా కేంద్రం మెగా టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలనుకుంటే టెక్స్ట్ టైల్ హబ్ గా ఉన్న సిరిసిల్లలో ఏర్పాటు చేయాలే తప్ప, ఇప్పటికే కాకతీయ పార్కు ఉన్న వరంగల్ లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని , ఈ విషయం ఇప్పటికే తమ నాయకులు స్థానిక ఎంపీ బండి సంజయ్ కి చెప్పిన ఆయన నుండి ఎలాంటి స్పందన లేదని, ఇంతకీ టెక్స్ట్ టైల్ పార్కుకు 'ఓనర్లు'ఎవరు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాడు. జగిత్యాల నుండి వరంగల్ వరకు చేపట్టే జాతీయ రహదారి 563 నిర్మాణం అలైన్మెంట్ లో అనేక   మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ పరిణామంతో నిర్మాణ వ్యయం, దూరం పెరిగి ప్రజాధనం వృధా అవుతుందే తప్ప ఏలాంటి ప్రయోజనం లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆనాడే ఈ రహదారి అలైన్మెంట్ చేసి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా నిర్మాణం చేసేలా ప్రణాళికలు రూపొందించామని కానీ ఈనాడు కేవలం రెండు మెడికల్ కళాశాలలు, ఒక వ్యక్తి స్వప్రయోజనం కొరకు రోడ్డు అలైన్మెంట్ మార్చుతున్నారని,  దీనిపై ఎంపీ బండి సంజయ్ తో చర్చించిన ఎలాంటి స్పందన లేదని, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను ఉద్దేశించి అన్నాడు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకే రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని, అందుకే గత తొమ్మిదేళ్లలో ఏనాడు గుర్తుకు రాని రాష్ట్ర విభజన హామీలు సీఎం కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని, ఇదంతా పరస్పర ఒప్పందంలో భాగమేనని, వాస్తవానికి బి.జె.పి, బి.ఆర్.ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని,    కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇరు పార్టీల మద్యలో గొడవలు సృష్టించుకుంటూ, సంక్షేమ పథకాల అమలులో డబ్బుల పంపకాల విషయంలో కొత్త బిచ్చగాళ్ల వలే వ్యవహరిస్తూ ఫెడరల్ సిస్టంను, ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతిస్తున్నారని, 70ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఇలాంటి సంఘటన జరగలేదని  ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అంశాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని స్పష్టం చేశాడు.