లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు

లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు
  • వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రులపై పోలీసుల దాడి 
  • 18 మంది అరెస్ట్, ఇద్దరు పరారీ
  • 3 జెండర్ టెస్ట్ స్కానర్లు, 18 మొబైల్స్, రూ.73 వేల నగదు స్వాధీనం
  • కేసును బట్టి రూ.25 వేల నుంచి రూ.లక్ష వసూలు
  • ఆర్ఎంపీలకు 40 శాతం కమీషన్​
  • వరంగల్ సీపీ రంగనాథ్

ముద్ర ముద్ర ప్రతినిధి, వరంగల్: ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకుండా.. లింగ నిర్ధారణ చేసి, గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. సోమవారం కమిషనర్ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వరంగల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని తమకు పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈక్రమంలో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపురం ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో, వరంగల్ జిల్లాలోని పలు ఆస్పత్రులపై నిఘా పెట్టి లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేశామని సీపీ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి 3 లింగ నిర్ధారణ స్కానర్లు, 18 మొబైల్స్ రూ.73 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గర్భస్రావాల కోసం కేసును బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ అన్నారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్..
భ్రూణ హత్యల ముఠాలో ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ గతంలో స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్ గా పనిచేశాడు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ప్రవీణ్ తన భార్య సంధ్యారాణితో కలిసి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్​పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని దందాకు తెరలేపాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఆర్వోలు హాస్పిటల్ మేనేజ్మెంట్, సిబ్బంది డాక్టర్లతో కలిసి నెట్వర్క్ తయారు చేశాడు. రెండేళ్ల క్రితం ప్రవీణ్ ఇదే కేసులో ఓసారి అరెస్టయ్యాడు.

నిందితులు వీరే..
వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నే పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైతరాజు, కల్లా అర్జున్, ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నే ఆశాలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాశిరాజు దిలీప్, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

ఎక్కడెక్కడ..?
అరెస్టయిన నిందితులంతా ఒక నెట్వర్క్ గా ఏర్పడి లింగ నిర్ధారణ జరిగాకా.. వెసులుబాటును బట్టి ఆయా ఆస్పత్రుల్లో గర్భస్రావాలు చేస్తున్నారు. ఈ ముఠాకు ఉమ్మడి వరంగల్ తోపాటు, సరిహద్దు ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి పేషెంట్లు వస్తారు. గర్భవతులువచ్చే ప్రాంతాలకు అనుగుణంగా వీరి ఆసుపత్రి కేంద్రం మారుతూ ఉంటుంది. హనుమకొండ లోని లోటస్ హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్, నెక్కొండలోని ఉపేందర్(పార్థు) హాస్పిటల్, నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషల్ హాస్పిటళ్లలో గర్భస్రావాలు చేస్తున్నారు.

ముఠా.. కమిషన్ వాటా..
లింగ నిర్ధారణ గర్భస్రావం కోరుకున్న వారి నుంచి కేసును బట్టి ముఠా సభ్యులు రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీరు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ఆర్ఎంపీ దగ్గర నుంచి ఆసుపత్రి మేనేజ్మెంట్ డాక్టర్ వరకు వివిధ స్థాయిల్లో వివిధ శాతాల్లో కమిషన్ ను పంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ డాక్టర్​కు ఒక కేసుకు 30 నుంచి 40 కమిషన్ ను ముఠా అందిస్తోంది. కాగా నిందుతులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్క్ ఫోర్స్ డీసీపీ జితేందర్ రెడ్డి, ఇన్​స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్సైలు ఫసియుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్, ఏ హెచ్ టీయూ సిబ్బంది ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుల్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ కిషోర్ కుమార్, రాజు, ఆంజనేయులు, రజియా సుల్తానా, చైల్డ్ కోఆర్డినేటర్లు కృష్ణమూర్తి కృతిని కమిషనర్ అభినందించారు.