మంత్రి హరీష్ రావుతో విడదీయని బంధం

మంత్రి హరీష్ రావుతో విడదీయని బంధం
  • జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న సాయి చందు
  • చివరగా ఈనెల 15న సిద్దిపేట ఐటి టవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సాయి చందు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు కు సిద్దిపేట జిల్లాతో విడదీయని బంధం ఉంది.రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో సాయి చందుకున్న సన్నిహిత సంబంధాల వల్ల తరచుగా జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో సాయి చందు పాల్గొన్నారు.భారత రాష్ట్ర సమితి ఏర్పాటయ్యాక గత నెలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సాయి చందు పాల్గొని తన ఆటపాటలతో పార్టీ కార్యకర్తలను అలరింపజేశారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ వద్ద జరిగిన భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం దుబ్బాకలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఆనందంగా గడిపారు. జిల్లాలో చివరగా ఈనెల 15న జరిగిన ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో సాయి చందు పాల్గొన్నారు. దాదాపు గంటన్నర సేపు తన పాటలతో యువతను సాఫ్ట్వేర్ ఉద్యోగులను రంజింపజేశారు. తమ్ముడు సాయి చందు అంటూ ...హరీష్ రావు ఆత్మీయంగా పలకరించేవారు.

గిడ్డంగుల సంస్థ ద్వారా చిన్న కోడూరు మండలానికి నిధులు ఇచ్చిన సాయి చందు

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సాయిచంద్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో గిడ్డంగుల నిర్మాణానికి నిధులను కేటాయించారు. అంకిరెడ్డిపల్లి విట్లాపూర్ గ్రామాల్లోని గిడ్డంగుల నిర్మాణానికి సాయి చందు నిధులు కేటాయించి జిల్లాతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

సాయి చందు మృతి పట్ల సిద్దిపేట జిల్లా కళాకారుల దిగ్బ్రాంతి

తెలంగాణ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు ఆకస్మిక మృతి పట్ల సిద్దిపేట జిల్లాకు చెందిన కళాకారులు, గాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.సాయి చందు ఆకస్మిక మృతి పట్ల జిల్లాకు చెందిన ప్రముఖ గాయకుడు కళాకారుడు కళాంజలి రాజేష్ సంతాపం తెలిపారు.రాష్ట్రంలోని అనేక వేదికలలో సిద్దిపేట జిల్లాలోని పలు వేదికలపై తమతోపాటు సాయి చందు పాల్గొని పాటలు పాడారని రాజేష్ తెలిపారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటు అన్నారు.

భారత రాష్ట్ర సమితి సంతాపం

గాయకుడు సాయిచంద్ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి తీవ్ర సంతాపం వెలు బుచ్చింది. సిద్దిపేట జిల్లాతో బారాసతో సాయి చందు కు విడదీయని అనుబంధం ఉన్నదని ఆయన మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు.చిన్న కోడూరు మండలానికి గిడ్డంగుల కార్పొరేషన్ ద్వారా గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రత్యేక అభిమానాన్ని కూడా చాటుకున్నారని రాధాకృష్ణ చెప్పారు. సాయి చందు మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

మంజీరా కవుల సంతాపం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచిన గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మృతి పట్ల మంజీరా కవులు సంతాపం తెలిపారు. సాయి చందు మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, మంజీరా కవులు తైదల అంజయ్య, పప్పుల రాజిరెడ్డి, నందిని భగవాన్ రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.

సాయి చందు కు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నివాళి

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయి చందు కు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి నివాళులర్పించారు. హైదరాబాదులోని సాయి చందు గృహానికి వెళ్లి ఆయన పార్టీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య మంత్రి కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ తో సాయి చందు కు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.