ముచ్చటగా మూడు గ్రూపులు..

ముచ్చటగా మూడు గ్రూపులు..
  • మంత్రి కేటీఆర్ సభ సాక్షిగా.. వర్గ విబేధాలు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత నేవూరి
  • బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సొంత మండలంలో వ్యతిరేఖత
  • తోట, చీటీ, నేవూరి మధ్య పై పై ప్రేమలే.. ఎవరి గ్రూపులు వారివే..
  • ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు కేటీఆర్ దృష్టికి..
  • తోట కలుపుకపోడు.. వారు వ్యతిరేఖం చేయక మానరు..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సోంత మండలమైన ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ లో ముచ్చటగా మూడు గ్రూపులు తయారయ్యాయి. జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావ్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లు ఎవరికివారే గ్రూపు రాజకీయాలు చేస్తున్నరని మండలంలో రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంబోత్సవం రోజు సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి మంత్రి కేటీఆర్ సభా సాక్షిగాఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. కేటీఆర్ సర్.. మాకు మాకు పడుతలేదు.. తోట ఆగయ్య.. మమ్ములను కలుపకపోడు.. మేం ఎడమోహం.. పెడమోహంగా ఉన్న.. ఎమ్మెల్యే ఎన్నికల్లో.. మీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తాం.. కానీ తోట ఆగయ్య విషయంలో మాత్రం మాకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రకటించడంతో.. ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి.

ఇప్పటికే మండలం కేంద్రంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజకీయంగా పడటం లేదన్న విషయం మండలంలో చర్చించుకుంటున్నారు.దీనికి తోడు మంత్రి కేటీఆర్ బంధువైన ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు చీటీ లక్ష్మణ్ రావ్.. ఏకంగా మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ చే జడ్పీటీసీ కార్యాలయం ప్రారంభించుకోని.. తన క్యాడర్ను తాను కాపాడుకుంటూ.. ప్రతి రోజు మండలంలో గ్రామ పర్యటనలు చేస్తూ.. తన ఉనికి చాటుకుంటున్నాడు. జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యను చాలా కార్యక్రమాలకు ఆహ్వనించకుండానే జడ్పీటీసీ తన కార్యక్రమాలకు తాను కానిచ్చేస్తున్నడన్న ఆరోపణలు ఉన్నాయి. సిరిసిల్ల లో దశాబ్ది ఉత్సవాల్లో సైతం ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ నాయకులు ఫోటోలు దిగడానికి కూడా కలిసి నిలబడాటానికి ఇష్టపడలేదు. తోట ఆగయ్య వర్గం ఒక వైపు.. చీటీ లక్ష్మణ్రావు వర్గం మరోవైపు ఎవరికి వారు నిలబడి మరి ఫోటోలు దిగారు. వీరి అధిపత్య పోరుతో ఎల్లారెడ్డిపేటలో సామాన్య కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సైతం సోంత పార్టీ నాయకులను కలుపుకుపోవడంతో సమన్వయ పరచడంతో విఫలమవుతున్నరన్న విమర్శలు వస్తున్నాయి.