స్టేషన్ లో... గెలిచేది ఎవరో !?

స్టేషన్ లో... గెలిచేది ఎవరో !?

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో పదహారు మంది ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ బిఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ద్విముఖ పోరులో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గెలిచేది ఎవరో ? అనే ఉత్కంఠ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది.

“19 మంది బరిలో”

బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ, భారత చైతన్య యువజన  పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ, జై స్వరాజ్ పార్టీ, విద్యార్థుల రాజకీయ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) పార్టీలతోపాటు 8 మంది స్వతంత్ర అభ్యర్థుల తో కలిసి 19 మంది ఎన్నికల బరిలో దిగారు.

“ద్విముఖ పోరే”

19 మంది ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య ద్విముఖ పోరు సాగింది. టికెట్ల ప్రకటన, నామినేషన్ల దాఖలు, సభలు, సమావేశాలు, బహిరంగ సభల నిర్వహణలో అధికార పార్టీ ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వెనకంజలో ఉందని చెప్పాలి. అయితే పోలింగ్ కు వచ్చేవరకు ఓటరు నాడి విశ్లేషకుల సర్వేలకు అంతు చిక్కలేదు. డబ్బు, మద్యం, హామీలు ఏమిచ్చినా పోలింగ్ సరళి నువ్వా నేనా అన్నట్టుగా సాగిందని భావిస్తున్నారు.

“నిన్న బిఆర్ఎస్, నేడు ఎవరు?

2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను గెలిపించిన నియోజకవర్గ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది అందరిని వేధిస్తున్న ప్రశ్న.1978 నుండి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా స్టేషన్ ఘన్ పూర్ నుండి గోక రామస్వామి (కాంగ్రెస్) రెండు సార్లు, బొజ్జపల్లి రాజయ్య(టిడిపి) ఒక్కసారి, భువనగిరి ఆరోగ్యం (కాంగ్రెస్) ఒకసారి, కడియం శ్రీహరి (టిడిపి) మూడుసార్లు, డాక్టర్ రాజయ్య (కాంగ్రెస్) నుండి ఒకసారి, (టిఆర్ఎస్) నుండి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికలకు బుధవారం జరిగిన ఎన్నికలకు చాలా తేడా ఉన్నప్పటికీ నేడు ఎవరి(ఏ పార్టీ)ని ఆశీర్వదిస్తారనేది అందరిని వేధిస్తున్న ప్రశ్న.

“తగ్గిన పోలింగ్ శాతం”

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88.15 శాతం పోలింగ్ జరుగగా బుధవారం జరిగిన ఎన్నికల్లో 86.44 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే 1.71 శాతం పోలింగ్ తగ్గింది.

“మరో 24 గంటల ఉత్కంఠ”

అభ్యర్థుల భవిష్యత్తును తేల్చే ఓట్లు ఈవిఎంలలో భద్రంగా ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో పోటా పోటీగా పనిచేసిన కార్యకర్తలు అభిమానులు తామంటే తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా అభ్యర్థులు, నియోజకవర్గ ప్రజలు ఫలితాల కోసం మరో 24 గంటలు ఉత్కంఠంగా ఎదిరి చూడాల్సిందే.