గెలుపు ఓటములను నిర్ణయించనున్న పోల్ మేనేజ్ మెంట్

గెలుపు ఓటములను నిర్ణయించనున్న పోల్ మేనేజ్ మెంట్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పోల్ మేనేజ్ మెంట్ అంటే ఎన్నికల ప్రక్రిలో చాలా ముఖ్యమైనది,విలువైది. రాజకీయాల్లో ఎంత అనుభవమున్నా, లేకున్నా, ఆయా పార్టీల తరపున ఎంత ప్రచారం చేసినా, చేయకున్నా చివరిదశలో చేపట్టే పోల్ మేనేజ్ మెంట్ మాత్రం
చాలా కీలకమైనదని చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికలలో ఎంతో అనుభవం గడించిన, తలపండిన, రాజకీయ చాణక్యులు, పోల్ స్ట్రాటజీఅంచనావేసేవారు, రాజకీయ అనుభవజ్ఞులు, రాజకీయ మేధావులు, ఆయా పార్టీల తరపున ఉండే రాజకీయాలో పుష్కలంగా అనుభవం సంపాదించిన మహానుభావులు, పాలిటిక్స్, మేనేజ్ మెంట్ కోర్సులు చదివిన వారుఅందరు కూడా  ప్రావీణ్యం ఉన్నవారే. అలాంటి పోల్ మేనేజ్ మెంట్ ప్రావీణ్యం ఉన్నవారు ప్రస్తుతం అన్ని పార్టీలలోనూ ఉన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీల్లో ఉన్న యువరక్తంతో కూడిన యువతరం నేతలు, తమకు అనుభవం లేకపోవడం, మిడి మిడి జ్ఞానంతో పోల్ మేనేజ్ మెంట్ తెలియక, తెలిసినవారు చెప్పిన విధంగా వినకపోవడం, నడుచుకోకపోవడంతో ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓటములను చవిచూస్తుంటాయి. ఒక సినిమాకు తెరవెనుక దర్శకుడు మాదిరిగా రాజకీయ ఎన్నికలు అనే సినిమా విజయం సాధించడానికి పోల్ మేనేజ్ మెంట్ మేనేజర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికలు అనబడే ఈవెంట్ లాంటి చదరంగంలో పోల్ మేనేజ్ మెంట్ ఈవెంట్-మేనేజర్లు విస్తృత రాజకీయ అనుభవం గడించినవారు కావడంతో తాము పనిచేస్తున్న పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థుల విజయానికి కావాల్సిన చివరిదశ పోల్ మేనేజ్ మెంట్ ను చాలా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినవారు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పోల్ మేనేజ్ మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసిందని చెప్పవచ్చు. ఆయా రాజకీయ
పార్టీల వారు ఎంతో గొప్పగా ర్యాలీలు నిర్వహించి రోడ్ షోలతో ఆకట్టుకుని, బహిరంగ సభలు సక్సెస్ చేసి ఇక విజయం తమదే అన్న ఒక రకమైన ఊహాలోకంలో తేలిపోతుంటారు.

ప్రజలకు చేరువ అయ్యామని, ఇగ తమ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదనే ధీమాతో విజయాన్ని భీమా చేయించినంత సంభ్రమాశ్చర్యాలలో మునిగితేలుతుంటారు. అన్ని రకాలుగా ప్రచారం పూర్తి చేశామని, ప్రతి ఓటరు దగ్గరికి చేరామని, తమ తమ ప్రచారంలో అన్ని రకాలుగా అగ్రనాయకులు పాల్గొన్నారని, ఇగ ఎన్నికలు జరగడమే తరువాయి విజయం వరిస్తుందని నమ్ముతుంటారు. సప్త సముద్రాలు దాటి వచ్చిన అతను తన ఇంట్లోకి వెళుతూ ఇంటిముందు డ్రైనేజీలో పడిపోయినట్టు కొందరి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎన్నిరకాల ప్రచారాలు ఎంత గొప్పగా చేసినా ప్రజలను తృప్తి పరిచేది, ప్రతి ఓటరుకు చేరుకునే గొప్ప మార్గం మాత్రం పోల్ మేనేజ్ మెంట్. కొన్ని పార్టీలు ఎన్నికల తేదీకి వారం ముందు నుంచే పోల్  మేనేజ్ మెంట్ చేపడుతుంటాయి. అసలు నియోజకవర్గంలో ఉన్న ఓట్లెన్ని, ఏ గ్రామంలో, ఏ వార్డులో, ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్ని ఓట్లున్నాయి, ఆయా ప్రాంతాలలో ఉన్న ఓట్లలో సామాజికవర్గాల వారిగా ఓట్ల శాతం ఎంతుంది,యువత, మహిళ, పురుష ఓటర్లు ఎన్ని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు ఎంతమందికి అందాయి, అభివృద్ధి ఫలాలు ఎంతమందికి చేరాయి, కుల, మత వర్గాల వారిగా ఓట్లు ఎన్ని ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ ప్రాంతంలో ఎంత ఉంది,ఆయా ప్రాంతాలలో ఉద్యోగుల ఓట్లు ఎన్ని, మాస్ ఏరియాలో ఉన్న ఓట్లు ఎన్ని, మాస్ ఓటర్లకు ఏమేమి తాయిలాలు ఇవ్వాలి, క్లాస్ పీపుల్ ను ఎలా తమవైపు తిప్పుకోవాలి, ఆయా ప్రాంతంలోని ఓటర్లు ఎంత డబ్బును ఆశిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ ఒక్కో ఓటుకు ఎంత ఇచ్చింది, మనం ఎంత ఇవ్వాలి. అందుకు కావాల్సిన నమ్మకస్తులతో యంత్రాంగాన్ని రూపొందించుకుని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసి వాటిని అమలు చేయడానికి ఏ విధంగా నగదును, మద్యం తదితర తాయిలాలను ఓటరుకు చేర్చాలి అనే ఆర్థిక విషయాలు పూర్తి అవగాహనతో ఉన్న, ఈ విషయాలను విజయవంతంగా పూర్తిచేసిన రాజకీయ పార్టీల వారే ఎన్నికలలో విజయం సాధిస్తారని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరూపించనున్నాయి. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ బాగా చేసిన వారే విజేతలు కానున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.