వివేకా హత్య కేసులో ఆధారాలున్నాయి.. షర్మిల కీలక వ్యాఖ్యలు

వివేకా హత్య కేసులో ఆధారాలున్నాయి.. షర్మిల కీలక వ్యాఖ్యలు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైయస్‌ఆర్‌ జిల్లా సున్నపురాళ్లపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే కడప నుంచి అతడిని మార్చాలని వైసీపీ చూస్తుందని పేర్కొన్నారు. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్‌ నమ్మినట్టే కదా అని అన్నారు. 

వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్‌ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? అని ప్రశ్నించారు. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం.. న్యాయం చేయండి అంటూ ప్రజలను కోరారు. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో.. ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.

  • ఆధారాలు ఉన్నాయి…

వివేకా హత్య విషయంలో మేం ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని అన్నారు షర్మిల. హత్య కేసులో ఆధారాలున్నందునే గట్టిగా చెబుతున్నాం అని పేర్కొన్నారు. మళ్లీ అన్యాయం జరగకూడదనే అక్కాచెల్లెళ్లు పోరాడుతున్నాం అని అన్నారు. హత్యా రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటం అని తెలిపారు.