రోడ్డు ప్ర‌మాదంలో మరణించిన కండ‌క్ట‌ర్ కుటుంబానికి రూ.40ల‌క్ష‌ల అంద‌జేత‌

రోడ్డు ప్ర‌మాదంలో మరణించిన కండ‌క్ట‌ర్ కుటుంబానికి రూ.40ల‌క్ష‌ల అంద‌జేత‌

ముద్ర ప్రతినిధి, మెదక్:రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్‌ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. విధులు ముగించుకుని తన స్వగ్రామం నాగపూర్ కి బైక్ పై వెళ్తుండగా త్రిబుల్ రైడింగ్ తో దూసుకువచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం మెదక్ జిల్లా హవేలి ఘనాపూర్ లోని టీ టైమ్ వద్ద జరిగింది.  అంజయ్యకు తల, ముఖంపై తీవ్ర గాయాలై రక్త స్రావం కావడంతో ఆయన మరణించారు. ఇంటికి పెద్దదిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్ట‌ర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.  ఉచిత ప్ర‌మాద బీమా సౌకర్యం ద్వారా ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు వరకు యూబీఐ అందజేస్తోంది. మంగళవారం హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం మరణించిన కండక్ట‌ర్ సిహెచ్. అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండి.వి.సి. సజ్జనర్‌ అంద‌జేశారు. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ అంజయ్య భార్య మణెమ్మతో పాటు కుమారుడు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్‌ వి.రవిందర్‌, ఎస్‌.కృష్ణకాంత్‌, పీవీ మునిశేఖర్, పురుషోత్తం,  ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణన్, సిద్దిపేట రీజినల్ హెడ్ వికాస్, చీఫ్ మేనేజర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.