ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎయిమ్స్ అడుగులు

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎయిమ్స్ అడుగులు

 పద్మశ్రీ యోగేష్ చావ్లా


బీబీనగర్, ముద్ర ప్రతినిధి: ప్రజారోగ్యమే లక్ష్యంగా బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అడుగులు వేస్తోందని పద్మశ్రీ యోగేష్ చావ్లాతో పాటు ఎయిమ్స్ రిషికేష్ డైరెక్టర్ డాక్టర్ మీను సింగ్ పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా సోమవారం ఎయిమ్స్ లో కార్యనిర్వాహక సంచాలకులు వికాస్ భాటియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పునాదులు వేసిన ఏడాదిలోపే దాదాపు 70 శాతం భవనాల నిర్మాణ పనులు పూర్తి కావడం డైరెక్టర్ వికాస్ భాటియా ప్రత్యేక చొరవకు నిదర్శనమని వారు అన్నారు. ఎయిమ్స్ లో అందుతున్న వైద్య సేవలను వివరిస్తూ, ఇక్కడి వైద్యులపై ప్రశంసల జల్లు  కురిపించారు.

ఈ సందర్భంగా పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన వైద్య విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అవార్డులు అందించారు. అంతకుముందు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా, ఎయిమ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ డిసౌజ ఎయిమ్స్ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అవగాహన సదస్సుల వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలోఐఐపీహెచ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ మూర్తి, డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, డీన్ రీసెర్చ్ డాక్టర్ సంగీత సంపత్, డాక్టర్ నితిన్ అశోక్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, హెచ్ ఓ డి నీరజ అగర్వాల్, వైద్యులు మౌనిక రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్యామల అయ్యర్,  ప్రఫుల్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.