సమ్మోహన భరితం శతగలార్చన

సమ్మోహన భరితం శతగలార్చన
  • 130 మంది గాయకులచే అన్నమయ్య కీర్తనల గానం
  • అన్నమయ్య కీర్తనలతో మారుమ్రోగిన వెంకటేశ్వర మందిర ప్రాంగణం
  • భారతీయ సంగీతంలో కర్ణాటక సంగీతం ఒక శైలి
  • కోరుట్లలో వాంగ్మయి శిక్షణాలయం అధ్వర్యంలో అపురూప వేడుక

ముద్ర, కోరుట్ల: భారతీయ శాస్త్రీయ సంగీతంలో కర్ణాటక సంగీతం ఒక శైలి అని కర్ణాటక నిజామాబాద్ ప్రభుత్వ సంగీత పాఠశాల అధ్యాపకురాలు స్వప్నరాణి అన్నారు. సామవేదం నుంచి ఉద్భవించింది కర్ణాటక సంగీతమని దక్షిణ భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో కర్ణాటక సంగీతం బహుళ ప్రచారంలో ఉండడంతో పాటు అనేక మంది సుప్రసిద్ధ పండితులు ఉన్నారని అన్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి రోజురోజుకు పెరుగుతుందని వివరించారు. కోరుట్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరంలో శ్రీ వాంగ్మయి సంగీత శిక్షణాలాయం అధ్వర్యంలో బుధవారం శతగలార్చన కార్యక్రమం సమ్మోహన భరితంగా జరిగింది. ఒకవంద ముప్పయి మంది గాయకులు ఏకకాలంలో అన్నమయ్య కీర్తనలను శ్రుతి బద్దంగా ఆలపించారు.

ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా హాజరైన కర్ణాటక సంగీత అధ్యాపకురాలు స్వప్నరాణి హాజరయ్యరు. ముందుగా స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుంచి నగర సంకీర్తనతో గాయకులు వెంకటేశ్వరస్వామి మందిరానికి చేరుకున్నారు. తొలుత కాసేపు త్యాగరాజ స్వామి, అన్నమయ్య కీర్తనలను స్వప్నరాణి ఆలపించగా తదుపరి వాంగ్మయి శిక్షణాలయ నిర్వాహకురాలు స్వాతి అన్నమయ్య కీర్తన ఆలపించారు. వారితో పాటూ  వచ్చిన 130 మంది గాయకులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. మొదట కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు కీర్తనల తో మొదలుకొని  వరుసక్రమంలో కీర్తనలను ఆలపించి చివరగా అదివో అల్లదివో  శ్రీహరివాసము అనే కీర్తనలతో ముగించారు. చిన్నారులు కీర్తనల ఆలాపనతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.  ప్రేక్షకులు, శ్రోతలు కీర్తనలు విని మైమరిచి పోయారు. ఎంతో చక్కగా శ్రుతిలో కీర్తనలు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు చిన్నారుల కీర్తనల ఆలాపనతో పరవశించారు. ఓకే రకమైన సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన గాయకులు భారతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. శతగలార్చనలో పాల్గొన్న గాయకులకు ప్రశంస పత్రాలను అందజేశారు.  హైదరాబాద్ కు చెందిన ప్రముఖ తబలా, మృదంగం, వాయిలిన్ వాయిద్య విద్వాంసులు శంకర్ సింగ్ చౌహాన్, వీరస్వామి, విశ్వనాథ శాస్త్రిలు, వ్యాయిద్య సహకారం అందించారు.  

మున్సిపల్ ఛైర్పర్సన్ లావణ్య మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతంతో పిల్లల్లో సంస్కారం అలవడుతుందని అన్నారు.పిల్లలకు చిన్నప్పటి నుంచే సంగీతం లాంటి ఫైన్ ఆర్ట్స్ కళలను నేర్పాలని సూచించారు. ప్రతి ఏడాది ఇలాంటి శత గలార్చన  కార్యక్రమాలను నిర్వహించాలని వాంగ్మయి శిక్షణాలయ నిర్వాహకురాలు గిన్నెల స్వాతిని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మెన్ అన్నం లావణ్య అనిల్, కొత్త సురేష్, తునికి భాస్కర్,  ఇందూరి సత్యం, బాలే నర్సయ్య, గిన్నెల శ్రీకాంత్ మరియు సంగీత అభిమానులు పాల్గొన్నారు.