పానుగల్ ఎంపీపి పై హత్యాయత్నం

పానుగల్ ఎంపీపి పై హత్యాయత్నం
  • ఒంటి పై డీజిల్ చల్లి అంటించెందుకు యత్నం
  • నిందితులను కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ రాస్తారోకో
  • ఎంపిపిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ముద్ర,పానుగల్ : వనపర్తి జిల్లా పానగల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై పానుగల్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు హత్యా యత్నానికి పాల్పడ్డారు.ఇట్టి సంఘటనపై మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు.జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పెద్దమ్మ గుడి వద్ద ఎంపీపీ మాట్లాడుకుంటూ వుండగా కొందరి ప్రోత్సాహంతో అటుగా వచ్చిన గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఆది శ్రీను,ఆది స్వామీ ఇద్దరు వచ్చి మాకు దళిత బంధు రాకపోవడానికి నీవే కారణం అంటూ నిన్ను చంపుతాం అని దుర్భాషలడుతూ వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటి పై చల్లి అంటించేందుకు ప్రయత్నించగా అక్కడ వున్న వారు విడిపించగా వాళ్లపై కూడా దాడి చేయడంతో క్రింద పడ్డారనీ అన్నారు.

ఎలాగైనా చంపుతాం అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టారనీ,ఎంపీపీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చెయ్యగా ఇద్దరినీ స్టేషన్ కు పిలిపించి వెంటనే వదిలివెయ్యడంతో సదరు వ్యక్తులు మళ్ళీ వచ్చి ఎంపీపీ తల్లి,తండ్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు.ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాగైనా చంపుతామని,గతంలో రెండు సార్లు తప్పించుకున్నావు అంటూ తిట్టారన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు,ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఎలాంటి దాడులు జరగలేదని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు నిర్వహిస్తున్నారని నిందితులపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించేది లేదని బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

వనపర్తి సీఐ మహేశ్వర్ రావు,వనపర్తి పట్టణ,రూరల్ ఎస్ఐ లు యుగంధర్ రెడ్డి,నాగన్న, పానుగల్ ఎస్ఐ వేణు లు మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

ఎంపీపీ కి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

పానుగల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నంకు పాల్పడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాషరావు లు అన్నారు.పానుగల్ లో ఎంపీపీ ఇంటికి వెళ్లి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బిఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, భౌతిక దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రతి దాడులు తప్పవన్నారు.

కొల్లాపూర్ నియోజక వర్గంలో గత ఐదేళ్ల పాలనలో దాడులు జరగలేదని అన్నారు. ఎంపీపీ పై దాడికి ఉసగోల్పిన వారిపై కూడా చట్టపరమైనమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎంపీపీ ని పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా,మండల నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు