గెలుపోటములపై అభ్యర్థుల ధీమా

గెలుపోటములపై అభ్యర్థుల ధీమా
  • విజయంపై ఎవరికివారే అంచనాలు
  • విజయం తమదంటే తమదే అని అన్ని పార్టీల్లోనూ జోరుగా చర్చలు
  • మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న  పార్టీలు
  • ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
  • ఓటర్ అన్న ఎవరిని ముంచునో, మరి ఎవరిని తేల్చునో

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటములపై అన్ని పార్టీలు కూడా తమదే విజయమనే ధీమాతో ఉన్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆయా పార్టీల వారు విజయంపై ఎవరికివారే అంచనాలు వేసుకుంటున్నారు. తమకు గెలుపు లభిస్తుందని నమ్మకంగా, ప్రత్యర్థి పార్టీవారు. ఓడిపోతారని మరింత నమ్మకంగా ఆయా పార్టీల అభ్యర్ధులున్నారు. ఆయా పార్టీల వారు వాస్తవ పరిస్థితులు తమకు కొద్దికొద్దిగా తెలుస్తున్నప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. పార్టీలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు, పార్టీ కేడర్ నిరుత్సాహానికి, నిరాశకు గురికాకుండా విజయం మనదే అని జోష్ నింపుతూ ఇన్నిరోజులుగా అలిసిన ప్రాణాలకు ఊపిరి పోస్తున్నారు. గురువారం ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగియడంతో ఊపిరి పీల్చుకుని కాస్త రిలాక్సేషన్ కొందరు కాగా, మరికొందరు మాత్రం పేపరు, పెన్ను, క్యాలికులేటర్లు, ల్యాప్ టాప్ లు ముందేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు.

ఏతావాతా తేల్చేదేమంటే గెలుపుమాత్రం తమ కోర్టులోనే ఉందని ధీమాగా చెబుతున్నారు. ఇన్ని రోజులుగా ప్రచారంలో కష్టపడ్డ ముఖ్యనాయకులు, కేడర్ ను కాస్త సేదతీరుస్తూ అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా ఉంటుందో, ఏక్కడ తమకు ప్రతికూలంగా ఉంటుందో చర్చిస్తున్నారు. ఫలానా వార్డు, ఫలానా గ్రామం, ఫలానా తండాలలో ఫలానా పోలింగ్ స్టేషన్లో ఎట్లా ఓట్లు పోల్ అయ్యాయని ఆరా తీస్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్ ఎట్లా చేశామని తర్కించుకుంటూ లోపాలు ఎక్కడ అయినా జరిగాయా, తాము అనుకున్న లబ్దిదారులకు అన్నీ చేరాల్సినవి చేరాయా అని ఎంక్వైయిరీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా బేరీజు వేసుకుని విజయం ఖాయమనే ధీమాతో, గెలుపు పై పూర్తి భరోసాతో ఉన్నారు. కొన్నిచోట్ల నుంచి వాస్తవంగా ప్రతికూల వార్తలు వస్తున్నప్పటికీ పైకి కనబడకుండా కవరింగ్ ఇస్తూ గెలుపుకు ధోకాలేదని బీరాలు పలుకుతున్నారు.

తప్పక గెలుస్తామని పోటీ చేసిన అందరు అభ్యర్థుల్లో ఉండడం మనిషి ఆశాజీవి అనే విషయాన్ని తేటతెల్లం చేసినా, పోటీలో ఎందరున్నా గెలిచేది ఒకరనే చేదు నిజాన్ని మాత్రం మరుస్తున్నారు. విజయం అనే తీపి ఫలాలకు అలవాటుపడ్డ రాజకీయ ప్రాణులు చేదు అనే ఓటమిని తొందరగా జీర్ణించుకోలేక విజయం తమదంటే తమదనే భ్రమలో ఉన్నప్పటికీ ఒక రకమైన మానసిక డోలాయమాన పరిస్థితుల్లో పోటీ అభ్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏదేని నియోజకవర్గంలో విజయం అనేది ఒకరినే వరిస్తుంది అన్న విషయం మాత్రం సుస్పష్టం అయినప్పటికీ అందరూ గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇన్నాళ్ళు పడ్డ తమ శ్రమకు ఓటర్లు మంచి ఫలితాన్నే ఇవ్వబోతున్నారనే తమ తమ వందిమాగధులు వర్తమానాలు, వేగుల సమాచారంతో, మరింతగా రెట్టించిన ఉత్సాహం ఉరకలు వేస్తుంటే విందు, వినోదాల్లో మునిగితేలుతూ విజయసాగరంలో ఓలలాడాలని పరుగులు పెడుతున్నారు. తమకు తెలిసిన, తమతో పనిచేసిన ముఖ్యులు, రాజకీయ అనుభవం కలవారి ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ స్థితి, పరిస్థితి ఎలా ఉంటుందనే హస్తసాముద్రికాలు, జ్యోష్యం చెప్పించుకుంటూ గుళ్ళు, గోపురాలు కుటుంబ సమేతంగా తిరుగుతున్నారు. మరికొందరు బంధుమిత్ర సపరివార సమేతంగా విహారయాత్రలు చేపట్టారు. విజయం వరిస్తుందా, లేదా అన్న మీమాంసలో మరికొందరు ఊగిసలాడుతున్నారు. తమకు నమ్మకం ఉన్న అనుయాయుల ద్వారా రహస్యంగా ఓటింగ్ ప్రక్రియ ఎలా జరిగిందో సమాచారం తెలుసుకుంటూ విజయమో, వీరస్వర్గమో వరించేది ఏదైనా సిద్ధంగా ఉండాలని తమ తమ కేడర్ కు నూరిపోస్తున్నారు. ఏది ఎట్లా ఉన్నా, ఏమైనా డిసెంబర్ 3వ తేది తలరాతను, విధివ్రాతను, ఓటర్లు ఇచ్చే  తీర్పును వెలువరించనుంది.